మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులనూ హెచ్చరించారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తున్నారని.. ఆయన మెప్పు పొందలేరని వ్యాఖ్యానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన భాజపా కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు.
తెరాసలో హరీశ్‌రావుకు చివరకు తనకు పట్టిన గతే పడుతుందని జోస్యం ఈటల చెప్పారు. హరీశ్ రావు ఇక్కడి మందిని గెస్ట్‌హౌస్‌కు తీసుకుపోవడం దావత్ ఇయ్యడం.. డబ్బులు ఇయ్యడం.. ఇదే పని చేస్తున్నారని ఈటల విమర్శలు గుప్పించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా సీఎం కేసీఆర్ కుట్రలు చేశారన్నారు. పోలీసులు కూడా బానిసలుగా మారి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు చట్టానికి ధర్మానికి లోబడి పనిచేస్తున్నారా.. చుట్టానికి లోబడి పనిచేస్తున్నారా అని నిలదీశారు.
ఎన్నిరకాలుగా బెదిరించినా తాను గెలవడం ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ వైపు చూస్తున్నారని, డబ్బు, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందన్నారు. తమ వైపు తిరిగే యువకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి ఒక్కరిని బెదిరించి తెరాస కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, భాజపా కార్యకర్తలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. ఏ రోజైనా హుజూరాబాద్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారా? అని ప్రశ్నించిన ఈటల.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు… కానీ ఇంత ఘోరంగా ఉంటారా..? మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి… రేపు మీ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఇంతే అవుతుందని ఈటల విమర్శించారు.
ఎన్నటికీ మెప్పు పొందలేవు..