పోలవరంలో డయాఫ్రం వాల్ ఏ సంస్థ కడుతోందో కూడా మంత్రి అనిల్‌కు తెలియకపోవటం సిగ్గుచేటని మాజీమంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. మంత్రి అనిల్ పోలవరంపై విషయం తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. పోలవరాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. 71 శాతం పనులు తెదేపా ప్రభుత్వం పూర్తి చేస్తే.. వైకాపా 2 శాతం కూడా చేయలేదని విమర్శించారు.
తెదేపా హయాంలో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తీసుకురాలేకపోయారని దేవినేని మండిపడ్డారు. సీఎం ప్రధానికి ఇప్పటికి రెండు లేఖలు రాశారని... త్వరలో మూడో లేఖ రాస్తారు కానీ అంతకంటే ఏం జరగదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ జరుగుతుంటే సీఎం దిల్లీ వెళ్లి ఎందుకు ఆందోళన చేయట్లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గట్టిగా చెప్పే ధైర్యం కూడా జగన్‌కి లేదని దుయ్యబట్టారు. ఈడీ కేసులు, జైలు భయంతో కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు.