సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని ట్విటర్ వేదికగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు స్వీకరించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన స్పష్టం చేశారు. 23 జిల్లాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ప్రభుత్వం 1825 కోట్లు బీసీ సంక్షేమం కోసం వెచ్చిస్తే... 13 జిల్లాల నవ్యంధ్రప్రదేశ్ లో బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం 43 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
పేద వాడి నోటికాడ ముద్ద లాగేసిన వైకాపా ప్రభుత్వం సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. రిజర్వేషన్లకు కోతపెట్టి, కార్పొరేషన్ నిర్వీర్యం చేసి.. ఆదరణను ఎత్తేసిన వైకాపా ప్రభుత్వం బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీల సంక్షేమం కోసం తెదేపా హయాంలో చేపట్టిన కార్యక్రమాలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.