తాము బానిసలం కాదు.. పాలకులమని.. బీఎస్పీలో చేరిన సందర్భంగా తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజని అన్నారు. రాజీనామా నిర్ణయం తన తల్లితో చెప్పినప్పుడు..' మన కుటుంబంలోనే చాలా మంది కూలీ పనులు చేస్తున్నారని.. నువ్వు ఒక్కడివే ఐపీఎస్వు ఉన్నావని చెప్పుకుంటున్నాం. నీ ఒక్కడి వల్ల మార్పు వస్తుందా' అని ప్రశ్నించిందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. తాను ఒక్కడినే కాదని.. ఎందరో ప్రవీణ్ కుమార్‌లు ఉన్నారని చెప్పానని తెలిపారు. తానొక్కడినే సంతోషపడితేకాదు.. తనలాంటి వాళ్లు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నట్లు తన తల్లితో చెప్పానన్నారు.
తెలంగాణలోని నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీ కండువా కప్పి.. సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటించారు. సుమారు 1,300 మంది ఆత్మహత్య చేసుకున్న స్థూపం వద్ద నివాళులు అర్పించి వచ్చానని.. ఎన్ని కుట్రలు చేసినా తమ బిడ్డలు ఆగరని.. ప్రగతిభవన్‌కు తప్పనిసరిగా పోదామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. లక్షలాది ప్రవీణ్‌కుమార్‌ల బతుకులు మార్చేందుకు... రెక్కాడితేకానీ డొక్కాడని వారి జీవితాలు బాగు చేసేందుకు తాను ఐపీఎస్ పదవిని వదులుకున్నానని అన్నారు.
'అయ్యా సీఎంగారూ.. మీరు దళిత బంధు కోసం రూ.1,000 కోట్లు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? మా గిరిజన, ఆదివాసీ బిడ్డలు వ్యవసాయం చేసిన డబ్బులు, ఆదివాసి బిడ్డలు తేనె అమ్మిన సొమ్ములు, మా నేత కార్మికులు మగ్గాలు నేసి తీసుకొచ్చిన డబ్బులు.. మీరు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. నిజంగా మీకు ప్రేముంటే.. మీ ఆస్తులమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే, నాణ్యమైన విద్య, వైద్యం కావాలి. మీరు 1,000 గురుకులాలు పెట్టి.. మొత్తం మారిపోయిందని చెబుతున్నారు. గురుకులాల్లో కేవలం నాలుగు లక్షల మందే చదువుతున్నారు. దాంతో ఏ రకంగా బంగారు తెలంగాణ సాధ్యమో చెప్పండి.'