ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రవేశాల్లో ఓకే.. ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు ఎప్పుడో? - ఈడబ్యూఎస్ రిజర్వేషన్ల ఏపీ

ఈడబ్యూఎస్ అమలైతే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటి వరకూ రిజర్వేషన్లు పొందని వారు.. కేంద్రం ఈడబ్యూఎస్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు సహా వేటిలోనూ అమలుకాని రిజర్వేషన్లురాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే వర్తింపుస్పష్టత ఇవ్వకుండా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంపై నిరుద్యోగుల్లో ఆందోళన

ews resorvations
ews resorvations

By

Published : Jul 13, 2021, 4:14 AM IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్ల విధానం ఇంతవరకు అమల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తోంది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే చట్టం చేసింది. దానికి అనుగుణంగా... ఆ 10 శాతంలో కాపులకు ఐదు శాతం, మిగతా వర్గాల వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు చట్టాలు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దాంతో విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను వర్తింపజేస్తూ బీసీ సంక్షేమ శాఖ 2019 జులై 27న ఉత్తర్వులు (జీవో నెం.60) జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని అదే జీవోలో ఆ శాఖ పేర్కొంది. ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ లేవు.

విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్తింపజేసినప్పుడు, ఉద్యోగాల భర్తీలో ఎందుకు అమలు చేయరని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టు నుంచి స్పష్టత తీసుకుని ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర చట్టం ప్రకారం... శాశ్వత ఉద్యోగాలతో పాటు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగాల్లోను ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. గత రెండేళ్లలో లక్షల సంఖ్యలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాలు, ఆప్కోస్‌ ద్వారా వేల సంఖ్యలో జరిపిన పొరుగు సేవల ఉద్యోగాల నియామకాలతో పాటు దేనిలోనూ దీనిని అమలు చేయలేదు.

కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోయినా..!

ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను... రాష్ట్ర ప్రభుత్వం విభజించి కాపులకు ఐదు శాతం, మిగతా వారికి ఐదు శాతం ఇస్తూ చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, 103వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాన్ని అది ఉల్లంఘించినట్టవుతుందని హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలైంది. ఆ రెండు చట్టాల్ని రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఆ చట్టాల అమలుపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి మాత్రం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 103వ రాజ్యాంగ సవరణనే సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను మళ్లీ రెండు భాగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు చెల్లుతాయా లేదా అన్నది... ప్రతివాదుల నుంచి కౌంటర్‌ అఫిడవిట్‌లు తీసుకోకుండా నిర్ణయించలేమని హైకోర్టు పేర్కొంది. రిట్‌ పిటిషన్‌పై కోర్టు వెలువరించే తీర్పుపై ఆధారపడి ఉంటుందన్న నిబంధనతో... ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. రిట్‌ పిటిషన్‌పై తీర్పు పిటిషనర్లకు వ్యతిరేకంగా వస్తే, ఇప్పుడు జరిగే అడ్మిషన్ల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు కోరబోమని వారి నుంచి హామీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మధ్యంతర ఉత్తర్వును కారణంగా చూపుతూ ప్రభుత్వం కాపులకు 5శాతం ఇవ్వాలన్న నిబంధన పక్కనబెట్టి... మొత్తంగాఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తోంది.

‘‘కాపులకు ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదన్న సాకుతో ఈ ప్రభుత్వం.... మొత్తం ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం నిలిపివేసింది. కాపులకు ఐదు శాతం ఇవ్వడం కుదరకపోతే... మొత్తం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో అమలు చేయడానికి అడ్డంకి లేనప్పుడు, ఉద్యోగాల్లో మాత్రం ఎందుకు వస్తుంది? ఇప్పటికే రెండేళ్లయిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అమలు చేయాలి’’.

- దాసరి రాము, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పోరాట వేదిక గౌరవ ఛైర్మన్‌

‘‘పేరుకే అగ్రవర్ణాలైనా... వాటిలో చాలా మంది నిరుపేదలు, తిండికి అలమటిస్తున్న వారు ఉన్నారు. పేదరికం వల్ల పిల్లల్ని సరిగా చదివించలేకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. గడచిన రెండేళ్లలో ఉద్యోగ నియామకాల్లో 40-50 వేల మంది అగ్రవర్ణ పేదలు ఉద్యోగావకాశాలు కోల్పోయారు. అంటే అన్ని కుటుంబాలు నష్టపోయినట్టే’’.

- గంగలకుంట నరేష్‌కుమార్‌ రెడ్డి, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పోరాట వేదిక వర్కింగ్‌ ఛైర్మన్‌

నష్టపోయింది ఇలా...!

రాష్ట్రంలో గత రెండేళ్లలో 6.03 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. వాటిలో ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ ఉద్యోగుల్ని పక్కన పెడితే... ఈ రెండేళ్లలో సుమారు 5.50 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినట్టు. వాటిలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు 1,21,518, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు 2,59,565 ఉన్నాయి. కొవిడ్‌ అత్యవసర సేవల కోసం 26,325 మంది తాత్కాలిక ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించింది. ఆప్కోస్‌ ద్వారా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో 95,212 మందిని నియమించినట్టుగా పేర్కొంది. వీటన్నింటిలోనూ ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన వారు నష్టపోయారు.

క్యాలెండర్‌ వచ్చింది.. రిజర్వేషన్ల మాటేంటి?

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల్లో 10,143 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జూన్‌ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన రోజే... ఆ ఉత్తర్వులూ వెలువడ్డాయి. వాటిలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు తీసేసినా... ఇంకా సుమారు 9 వేలకుపైగా ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే, తమకు 900కిపైగా ఉద్యోగాలు వస్తాయని ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు చెందిన నిరుద్యోగులు చెబుతున్నారు.


ఇదీ చదవండి:'దిగువ కోర్టుల్లో ఇంటర్నెట్ సౌకర్యంపై వివరాలివ్వండి'

ABOUT THE AUTHOR

...view details