TRS Protest in Delhi: దేశ రాజధాని కేంద్రంగా మోదీ సర్కారుపై నిరసనకు తెరాస సిద్ధమయ్యింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టిన గులాబీ దళం.. సోమవారం రైతు దీక్ష పేరుతో దిల్లీ వేదికగా..కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనుంది. పంటల కొనుగోలులో జాతీయ విధానం అమలు చేయాలని... డిమాండ్ చేయనుంది. ఇందుకోసం హస్తినలో.. తెలంగాణ భవన్ వద్ద వేదికగా ఏర్పాట్లు చేశారు. టీఎస్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 15 వందల మంది ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేదిక నిర్మించారు.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు, రైతు సమన్వయ సమితి సభ్యులు దిల్లీ చేరుకోగా.. మిగతా ప్రజాప్రతినిధులు పయనమయ్యారు. ధాన్యం కొనుగోలుపై.. తెరాస ప్రభుత్వం చేస్తున్న రైతు దీక్షకు అందరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రాజకీయ కోణంలోనే కేంద్రం..తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయట్లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
"దేశంలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూడడం మంచిది కాదు. రైతుసమాజ అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. కేంద్రం తాము చెప్పిందే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదు. రైతన్నలకు ఇంకా క్షోభ కలిగించడం సరికాదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణం. ఇదే భాజపా ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రంగుమారిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. కోటాను కోట్ల వ్యవసాయ కుటుంబాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. రాష్ట్రంలో యాసంగిలో పండిన మొత్తం పంటను ఏలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి." -నిరంజన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి