రాష్ట్రంలో పోలింగ్ సందడి నెలకొంది. 12 కార్పొరేషన్లు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లోని 2వేల 794 వార్డులకు ఎన్నికల సంఘం గతేడాది మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది. కరోనా వల్ల నిలిచిన ఎన్నికలను..... ఈ నెల 2 నుంచి తిరిగి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో ప్రారంభించింది.12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా.. వీటిలో 90 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 581 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. 2వేల 571 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు..
75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 2వేల 123 వార్డులుండగా... 490 ఏకగ్రీవమయ్యాయి. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికల్లో అన్నింటిని వైకాపా ఏకగ్రీవం చేసింది. మిగిలిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 16వందల 33 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 4వేల 981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కలిపి 7వేల 549 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 77 లక్షల 73 వేల 231మంది ఓటర్లు ...అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.
అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు..
గుంటూరు నగరపాలికతో పాటు తెనాలి, రేపల్లె, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ పురపాలికలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 238 వార్డుల్లో 758 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని...9 లక్షల 26 వేల 64 మంది ఓటర్లు తేల్చనున్నారు. విజయవాడ నగరపాలికలో 64డివిజన్లలో పోలింగ్ జరగనుంది. 347 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వీరిలో 184మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు. 7లక్షల 81వేల 640ఓటర్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5గంటలలోపు ఎంతమంది క్యూలైన్లలో ఉంటే అంతమందికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. చుండూరి వెంకటరెడ్డి ప్రభుత్వ నగరపాలక ఉన్నత పాఠశాలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఓటు వేయనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
జిల్లాలో ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఏలూరు నగరపాలికలో 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 లక్షల 32వేల 972 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని పురపాలికలు........ ముమ్మడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 268 వార్డులు ఉండగా... 35 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 233 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 3లక్షల 52 వేల 136 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
విశాఖ జిల్లాలో..
జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఎన్నిక జరుగనుంది. విశాఖలో 98డివిజన్లు, ఎలమంచిలిలో 22, నర్సీపట్నంలో 28 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 18 లక్షల 5వేల 311మంది ఓటు వేయనున్నారు.