కరోనా తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లు, ఫ్లాట్లలో ఏదో ఒకటి చిన్నదైనా సొంతంగా సమకూర్చుకోవాలన్న ఆలోచన వారిలో మొదలైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో రూ.25-30 లక్షల ధరల్లో కట్టే ఫ్లాట్లకు గిరాకీ ఉంటుందని తెలిపారు. ఇప్పటికైతే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, మళ్లీ కొనుగోలుదారుల్లో నమ్మకం కుదిరినప్పుడే గాడిన పడుతుందని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం చేయూత ఉండాలని ఈనాడు-ఈటీవీ భారత్ ఆన్ లైన్లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రశ్న: ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కుంటున్నటువంటి సమస్యలేంటి, కరోనా అదేవిధంగా సుదీర్ఘ లాక్డౌన్లు ఎలాంటి ప్రభావం చూపాయని మీరనుకుంటున్నారు?
సమాధానం: 'విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సుమారు 20 వేల వరకు అపార్టుమెంట్ల పనులు నిలిచిపోయాయి. ప్రజలు ప్రస్తుతం, ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. లాక్ డౌన్ సడలించాక 25-30శాతం బిల్డర్లు ధైర్యం చేసి నిర్మాణాలు ప్రారంభించినా కార్మికల కొరత వేధిస్తోంది. తీవ్ర ఇసుక కొరత ఉంది.సిమెంట్ ఉక్కు కంపెనీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచేశారు. ఫలితంగా ఒక్కో చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం రూ.50-100 వరకు పెరిగింది. దాన్ని మేం కొనుగోలుదారులపై వేయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ, కొనుగోలు దారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఈ రంగం కోలుకోదు.
కప్ బోర్డులు, ఉడ్ వర్కు, సీలింగ్ వంటి పనులకు ఎక్కువగా ఉత్తరాధి కార్మికులపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. స్థానికంగానే మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా తెలియజేస్తోంది. ఇసుకకీ రోబో శాండ్ లాంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. యంత్రాల వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది.
రెరా నిబంధనల నుంచి ఏడాదిపాటు మినహాయింపు ఇవ్వాలి. వాటిలో కొన్ని కఠిన నిబంధనలున్నాయి. నిర్మాణానికి గ్యారెంటీ ఇవ్వగలం. దానిలో అమర్చిన ట్యూబ్లైట్లు వంటి వాటికి అయిదేళ్లు గ్యారెంటీ ఇవ్వాలంటే కష్టం. నిర్మాణ రంగానికి అవసరమైన 80శాతం పరికరాలను రిజిస్టర్ డీలర్ల నుంచే కొనాలని జీఎస్టీ నిబంధన చెబుతోంది. దిగువ శ్రేణి నగరాల్లో దాన్ని 50శాతానికి తగ్గించాలి'-సుధాకర్, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయవాడ.