ప్ర. తాము ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 90శాతం పైగా సత్ఫలితాలు అందిస్తోందని ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. దానిని సరఫరా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఎస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి..?
జ.వ్యాక్సిన్ మీద చాలా ఆశలున్నాయి. కానీ వ్యాక్సిన్లోగానే మనం చూడాల్సింది ఏంటంటే.. ప్రజల్లో భయం తగ్గింది. మరణాల రేటు బాగా తగ్గింది. వ్యాధి పెరిగింది, కేసుల సంఖ్య పెరిగింది కానీ.. దాని పట్ల భయం తగ్గింది. ప్రజల్లో కూడా ధైర్యం వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేయడం, మాస్కులు తీయడం వల్ల అక్కడక్కడా కరోనా మళ్లీ పెరుగుతోంది. సామాజిక వ్యాప్తి చెందడం వల్ల అందరికీ వచ్చి.. కోలుకుంటున్నారు. వ్యాక్సిన్ లేకపోతే కొంతకాలానికి.. ఇది బలహీనం అయ్యి... తగ్గిపోతుంది. ఇక ప్రజల్లో ఇమ్యూనిటీ ఏ స్థాయిలో పెరిగిందన్న దాని బట్టి దీని వ్యాప్తి ఉంటుంది. అందుకే కొంతమందిలో రెండోసారి కూడా వస్తోంది. అయితే ఇది ఒకసారి వచ్చి పోతుందా.. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుందా అనే దానిపై వైద్యులు తర్జన భర్జన పడుతున్నారు. ఫ్లూ తరహాలో ప్రతి సంవత్సరం వచ్చి పోతుందనే భావన కూడా ఉంది. ఫైజర్ వాళ్లు ఇస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే వాక్సిన్ ఆశాజనకంగానే ఉంది. కరోనాను ఎదుర్కొనే ఐజీజీ యాంటీబాడీలు వాక్సిన్ తీసుకున్న వారిలో ఉంటున్నాయి. అయితే దీనిపై ఇప్పుడే చెప్పలేం. నిజంగా 90శాతం ఉంటే మంచిదే. కానీ ఆరునెలలు, సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. ఫ్లూ తరహాలో ప్రతీ ఏడాది ఒక వ్యాక్సిన్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందా అని కూడా చూడాల్సి ఉంది.
ప్ర. మీరు చెప్పినట్లుగా భయం అయితే తగ్గింది. కానీ కరోనా పూర్తిగా పోయిందనే భరోసా అయితే రాలేదు. వ్యాక్సిన్ వస్తేనే కానీ పూర్తి భరోసా రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 90శాతం పాజిటివ్ రేటు రావడం అనేది సానుకూలాంశంగా చూడొచ్చా..?
జ.కచ్చి తంగా... ! వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యం కూడా జబ్బును ఎదుర్కొనే శక్తినిస్తుంది.
ప్ర. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి.. అవి ఏయే దశల్లో ఉన్నాయి..?
జ. చాలా కంపెనీలున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా కనిపిస్తున్నవి.. ఫైజర్, ఆక్స్ఫర్డ్, రష్యా వాళ్లు చేస్తున్న స్పుత్నిక్, చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ముఖ్యమైనవి. స్పుత్నిక్ విజయవంతం అయిందని చెబుతున్నారు కానీ.. వారి డేటా ప్రపంచంతో పంచుకోలేదు. కాబట్టి వాటిని నమ్మలేం. ఫైజర్, ఆక్స్ఫర్డ్, మొడర్నా వంటి కంపెనీలు అందరితో సమాచారాన్ని పంచుకుంటున్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మూడు నాలుగు వ్యాక్సిన్లకు మాత్రం దాదాపుగా ఎఫ్.డి.ఎ అనుమతి వచ్చినట్లే.. ! చిన్నచిన్న దుష్ఫ్రభావాలు మినహా.. ఇవి మంచి పనితీరునే కనబరిచాయి.
ప్ర. వ్యాక్సిన్ల తయారీలో ఎన్నిదశలు... ఎన్నిరకాలున్నాయి. వేటి ప్రభావం మెరుగ్గా ఉంటుంది...?
జ.ఇంజక్షన్ ద్వారా ఇచ్చే.. ఇంట్రామస్క్యులర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది. మిగతావన్నీ పరిశీలనా దశలోనే ఉన్నాయి.
ప్ర. దీనిలో నేరుగా వైరస్‌నే శరీరంలోకి ఇస్తారా.. ?
జ. వైరస్‌లోని ఎం-ఆర్ఎన్ఏ, ప్రోటీన్‌ను తీసుకుని ఇంజక్షన్ ద్వారా ఇస్తారు.
ప్ర. వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత కూడా వ్యాక్సిన్ తయారీకి ఇంత సమయం ఎందుకు పడుతోంది...?
జ. మనం రాకెట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఆలస్యం అయినట్లు కనిపిస్తోంది కానీ.. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ల చరిత్రలో మశూచి, పోలియో వ్యాక్సిన్లు అనేవి అత్యంత విజయవంతమైనవి. పోలియో వ్యాక్సిన్ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఒక క్రమబద్ధమైన వ్యాక్సిన్ నిర్ధారించడానికి కొన్నేళ్లు పట్టింది. వాటితో పోలిస్తే.. చాలా వేగంగా వచ్చింది. కంప్యూటర్ అనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ వల్ల ఇంకా చాలా వేగంగా విశ్లేషణ జరిగింది. అలాగే కొన్ని అనుమతులను సడలించడం వల్ల ఈ మాత్రమైనా జరిగింది. మామూలుగా అయితే 7-8ఏళ్లు పడుతుంది.
ప్ర. స్వైన్ ఫ్లూ, ఫ్లూ వంటి వ్యాక్సిన్లు తయారీ తొందరగా పూర్తయింది కదా.. దీనికి ఎందుకింత ఆలస్యం అవుతోంది..?
జ. ఫ్లూ అనేది కొత్త వ్యాక్సిన్ కాదు. వైరస్‌లో వస్తున్న మార్పులను బట్టి.. అప్పటికే ఉన్న వ్యాక్సిన్‌ను కొద్దిపాటి మార్పులు చేస్తారు. అది సమయం పట్టదు కదా.. హెచ్1ఎన్1( స్వైన్ ఫ్లూ) జబ్బు పరిస్థితి వేరు. దానికి కేవలం న్యూమోనియో వచ్చేది అంతే. కానీ కరోనా జబ్బు పరిధి చాలా ఎక్కువ. దీనిని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది. కొంతమందికి వచ్చి వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి అకస్మాత్తుగా తిరగబెట్టి ప్రాణాంతకంగా మారుతోంది. కొవిడ్ వల్ల గుండెపోటు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం రావడం ఇలా శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతోంది. స్వైన్ ఫ్లూ ఎలా ప్రభావం చూపుతుందన్నదానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది. కరోనా పూర్తిగా భిన్నం.
ప్ర. ఏడాదిలోగా వ్యాక్సిన్ రావడం శుభపరిణామం అని చెబుతున్నారు. ఇది మార్కెట్లో యథావిధిగా వస్తుందా..?. 90శాతం సానుకూలత ఆ తర్వాత కూడా ఉంటుందా..? ఇలా మార్కెట్లోకి వచ్చాక.. విఫలమైన వ్యాక్సిన్లు ఏమైనా ఉన్నాయా..?
జ. ప్రయోగదశ వేరు.. ప్రజల్లోకి రావడం వేరు...! ప్రజల్లో విరివిగా వాడిన తర్వాతనే దాని ప్రభావాన్ని నిర్థారించగలం. సీడీసీ వెబ్సైట్లో చూస్తే... కేవలం 20శాతం మాత్రమే ప్రభావం చూపిన వ్యాక్సిన్లు చాలా కనిపిస్తాయి. అమెరికాలో విడుదలయ్యే ఫ్లూ వ్యాక్సిన్ 40శాతం ఫలితాలనే ఇస్తుంది. వ్యాక్సిన్లే కాదు.. మందులు కూడా అన్ని ప్రయోగాలు దాటుకుని.. ఎఫ్.డి.ఎ అనుమతులతో వస్తాయి. కానీ జనాల్లోకి వచ్చిన రెండు మూడేళ్లలో అలాంటి మందులు కనబడకుండా పోతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం బాగుందని చెప్పగలం. ఏడాది తర్వాత యాంటీబాడీలను పరీశీలించిన తర్వాతే ఇది సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పగలం.
ప్ర. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..? వైరస్‌ను నేరుగా చంపుతుందా...? లేక యాంటీబాడీలను ప్రేరేపిస్తుందా..?
జ. రెండు రకాలుంటాయి. యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కూడా ఒక పద్ధతి. రోగ నిరోధకత అనేక రకాలుంటుంది. హ్యుమరల్ ఇమ్యూనిటీ అనేది శరీరంలో ఏదైనా కొత్త రసాయనం వచ్చినప్పుడు.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. సెల్ మీడియెటెడ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇందులో టీసెల్స్.. శరీరంలోకి వచ్చిన కొత్త, హానికారక పదార్థాన్ని గుర్తుపెట్టుకుంటాయి. మళ్లీ అలాంటిది వచ్చినప్పుడు.. దానిపై దాడి చేసి తీవ్రతను తగ్గిస్తాయి. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఈ రెండూ ఉన్నాయి. యాంటీబాడీ థియరీ ఆధారంగా మోనో క్లోనల్ యాంటీబాడీలను తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అలాంటిది ఇవ్వడం వల్లనే వేగంగా కోలుకున్నారు.