జీరో ఎడ్యుకేషన్ ఇయర్ మంచిది కాదు
కరోనా ఈ ప్రపంచాన్ని ప్రపంచాన్ని మార్చేసింది. అనేక అనివార్యతలు సృష్టించింది. పరిశుభ్రతను నేర్పించిందీ.. ప్రత్యామ్నాయాలు చూపించింది. దీనికి బాగా ప్రభావితమైంది విద్యావ్యవస్థ. యునెస్కో లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 138కోట్ల మంది విద్యార్థులు దీని ప్రభావానికి గురయ్యారు. మన దగ్గర కూడా దేశమంతా బడులు, కళాశాలలు బంద్ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం మొదలైనా... విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే మొదలయ్యే పరిస్థితి లేదు. ఎంత పెద్ద విపత్తులు వచ్చినా మొత్తం విద్యా సంవత్సరం పోయిన పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. కానీ కరోనా వలన ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేక మార్పులకు లోనవుతోంది. అనివార్యంగా ఆన్ లైన్ వైపు వెళ్లాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కేంద్ర మానవవనరుల శాఖ కూడా దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది. కోరనా ముప్పు ఎప్పటికి పూర్తిగా తొలగిపోతుందో తెలీని తరుణంలో మన ముందున్న మార్గం ఏంటి.. ? విద్యావిధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. దానికి మనం ఎలా సన్నద్ధం కావాల్సి ఉంది..? ప్రభుత్వాలు, ప్రజల బాధ్యతలు ఏంటి అనే విషయాలపై ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. విద్యావేత్త వాసిరెడ్డి అమరనాథ్, హెచ్‌సీయూ ప్రో వైస్ చాన్సలర్ బి.రాజశేఖర్, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ ఎన్. నారాయణ ఈ చర్చలో పాల్గొన్నారు. కరోనా కాలంలో ఆన్లైన్ విద్య అనివార్యం అని విద్యానిపుణులు అన్నారు. తరగతిగదిలో నేర్చుకున్న దానికి సరిసమానం కాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ప్రత్యామ్నాయం లేదన్నారు. చిన్నారులకు రేడియేషన్ సమస్య తలెత్తకుండా.. లైవ్ క్లాసులు కాకుండా వీడియోలు ద్వారా పాఠాలు చెప్పే విధానం మంచిదని సూచించారు.
కరోనా సంక్షోభం అన్లైన్ విద్యను అనివార్యం చేసింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ప్రత్యామ్నాయ విద్య అందించవచ్చు. చిన్న చిన్న వీడియోలుగా.. గ్రాఫిక్స్‌తో పాఠాలు రూపొందించాలి. భవిష్యత్‌లో రాబోయే మార్పులకు కరోనా తలుపులు తెరిచింది. ఆన్లైన్ విద్యను కొనసాగించాలని కర్ణాటక, బోంబే హైకోర్టులు చెప్పాయి. తరగతి గదిలో నేర్చుకున్న దానితో పోల్చితే.. ఆన్లైన్ ద్వారా 75శాతం ఫలితం ఉంటుంది. - వాసిరెడ్డి అమరనాథ్, విద్యావేత్త
ఆన్లైన్ విధానం తరగతి విధానానిని పూర్తి ప్రత్యామ్నాయం కాదు. రెండు విధానాల్లో లాభాలు నష్టాలు ఉన్నాయి. రెండు విధానాల్లో మెరుగైన వాటిని తీసుకోవాలి. ఆన్లైన్ విధానాన్ని ఆహ్వానించాలి. ఆన్లైన్ ద్వారా పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని అనుకోకూడదు. విరామం లేకుండా తరగతి గదుల్లో ఉంచడం వల్ల కూడా ఒత్తిడి ఉంది. విద్యాసంవత్సరాన్ని రద్దు చేయాలనుకోవడం సరికాదు. ఖాళీగా ఉంచితే విద్యార్థులు నష్టపోతారు. ఆన్లైన్ విధానంలో లోపాలు అధిగమించడానికి ప్రయత్నించాలి. - ప్రొ. బి. రాజశేఖర్, ప్రొ. వైస్ ఛాన్సలర్, హెచ్‌సీయూ
ఆన్లైన్ విద్యావిధానం అనివార్యం. పిల్లలు ఖాళీగా ఉంటే దెబ్బతింటారు. కరోనా వల్ల బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఖాళీగా ఉంటే మానసికంగా దెబ్బతింటారు. ఆన్లైన్ విధానంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. -ఎన్. నారాయణ, ఛైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్
ఆన్లైన్ పాఠాల కంటే వీడియో పాఠాలు మేలు
పాఠాలను వీడియోలుగా రూపొందించడమే అత్యుత్తమ విధానం అని విద్యావేత్తలు అన్నారు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వెసులుబాటు ఉండాలన్నారు. నామమాత్రంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో కొన్ని పాఠశాలలు ఇతర ఫీజులనూ కలిపి తీసుకుంటున్నాయని అటువంటి వారిని నిరోధించాలని వాసిరెడ్డి అమరనాథ్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ ఫీజులు తీసుకుంటున్న విషయం పేరెంట్స్ కమిటీ దృష్టికీ వచ్చిందని ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నారాయణ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ప్రభుత్వమే ట్యాబ్‌లు అందించాలన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రొఫెసర్ రాజశేఖర్ సూచించారు.
ఆన్లైన్లో నేరుగా పాఠం చెప్పే బదులు వీడియోలు తయారు చేయడం ఉత్తమం. మల్లీమీడియా వీడియోలు తల్లిదండ్రులకు ఇవ్వాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. పిల్లలకు వీలున్నప్పుడు చూస్తారు. ఇంటర్నెట్ ఉపయోగించి పిల్లలకు పక్కదారి పట్టకుండా అవకాశం ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు పేరుతో ఇతర ఫీజులు తీసుకోవడం తప్పు. అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవచ్చు. -వాసిరెడ్డి అమరనాథ్, విద్యావేత్త