ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామోజీ ఫిల్మ్‌ సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం - ఈటీవీకి 25 వసంతాలు

25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా.. ఈటీవీ రజతోత్సవాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా నిర్వహించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో పాటు మూడోతరం కుటుంబసభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరిగాయి.

etv 25 years celebrations in ramoji film city
'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

By

Published : Aug 27, 2020, 8:42 PM IST

'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ఈటీవీ 25ఏళ్లు ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో పాటు ఈటీవీ ఛానల్స్‌ సీఈవో బాపినీడు, యాజమాన్య ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ హాజరయ్యారు. రామోజీరావు కుటుంబానికి చెందిన మూడోతరం కుటుంబసభ్యులు... సహరి-రేచస్‌, సోహన-వినయ్‌, బృహతి, సుజయ్‌లు వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఉద్యోగులతో ముచ్చటించిన రామోజీరావు

అనంతరం రామోజీరావు మనవడు, సుమన్‌ తనయుడు సుజయ్‌ చేత... మనవరాళ్లు కేక్‌ కట్‌ చేయించారు. ఈటీవీ పాతికేళ్ల ప్రయాణంలో భాగస్వామ్యులైన ఉద్యోగులతో రామోజీరావు ముచ్చటించారు.

ఈటీవీ రజతోత్సవంలో నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ పి.కె.మాన్వీ, ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అజయ్‌శాంతి, కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్, ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌, గ్రూప్‌ హెచ్​ఆర్​-ప్రెసిడెంట్‌ గోపాలరావు పాల్గొన్నారు.

అందరికీ నమస్కారం. ఈటీవీ పుట్టి ఈనాటికి పాతికేళ్లు. ప్రసారాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే తెలుగు ప్రేక్షకులు ఈటీవీని అమితంగా ప్రేమించారు. అభిమానించారు. మీ ఆదరణ, మీ ఆశీస్సులు ఎంతో విలువైనవి. వెలకట్టలేనివి. అందుకే దేశదేశాలలోని తెలుగు ప్రజలందరిదీ ఈ విజయం. ఈ ఘనత మీది. ఈ చరిత మీది. మనసారా ధన్యవాదాలు. పొత్తిళ్లలోని బిడ్డ మన కళ్ల ముందే పెరిగి పేరు తెచ్చుకుంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ పాతిక సంవత్సరాల పేజీలు ఒకసారి వెనక్కి తిప్పుతుంటే వార్తారంగంలో, వినోదాల ప్రపంచంలో ఈటీవీ అధిగమించిన మైలురాళ్లు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఎదురుగా కదలాడుతున్నాయి. ఈటీవీ ప్రారంభించిన రోజే... నేను ఒక మాట ఇచ్చాను. ఈటీవీలో ప్రసారమయ్యే ఏ కార్యక్రమమైనా.... అందంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని, అనుభూతిని కలిగించి ఆలోచన రేకెత్తిస్తుందని. ఈరోజు వరకూ ఈటీవీ... ఈ నిబద్ధతను నిజాయతీగా పాటించింది.

ప్రయోగం లేకపోతే ప్రయాణమే లేదు. కొత్తను ఎప్పుడూ ఆహ్వానించాల్సిందే. అలాగని ప్రతి కొత్తని ఆహ్వానిస్తే అది ప్రమాదకరం కావొచ్చు. ఈ నిజాన్ని గుర్తెరిగి నడుచుకుంది ఈటీవీ. అందుకే ఈ రోజుకీ సకుటుంబంగా చూడగల చక్కటి ఛానెల్‌గా మీ మన్ననలు అందుకుంటోంది. ఇందుకు కారణమైన ఎంతోమంది నటీనటులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కేబుల్‌ ఆపరేటర్లు, ప్రకటనకర్తలు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈటీవీ కార్యనిర్వాహక బృందం, సిబ్బంది... వీళ్లందరి నిర్విరామ కృషికి ఫలితమే నేటి ఈ వెండి వేడుక. నా కుటుంబ సభ్యులైన ఈటీవీయన్స్‌ అందర్నీ మనసారా అభినందిస్తూ తెలుగువారికి ఈటీవీ ఎప్పటిలా తిరుగులేని వినోదాన్ని అందిస్తుందని వినమ్రంగా తెలియజేస్తూ సెలవు.

- రామోజీరావు, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్

--

ఇవీ చూడండి:

ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details