ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

దక్షిణ భారత టెలివిజన్‌ రంగంలో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టిన... మీటీవీ ఈటీవీ.. ఇరవై ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు టెలివిజన్‌ రంగంలో రెండున్నర దశాబ్దాల పాటు ప్రేక్షక నీరాజనాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈటీవీ రజతోత్సవం జరుపుకుంది. ఆబాల గోపాలాన్ని అలరించే కార్యక్రమాలు, విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తలకు చిరునామాగా నిలిచి.. 25వ పుట్టినరోజును జరుపుకున్న ఈటీవీ.. మరెన్నో ఆనందాలు, సంతోషాలకు స్వాగతం పలుకుతోంది.

etv-25-years-celebration
'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

By

Published : Aug 27, 2020, 8:30 PM IST

'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

తెలుగు టెలివిజన్‌ రంగంలో ఈనాడు టెలివిజన్‌ ఓ సంచలనం. వినోదానికి సరికొత్త నిర్వచనానిస్తూ ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచింది. రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో జనరంజకమైన ఎన్నో కార్యక్రమాలతో అలరిస్తూ... తెలుగువారి ప్రియనేస్తంగా నిలిచింది. డైలీ సీరియల్స్‌, పౌరాణిక ధారావాహికలు, రియాల్టీ షోలు, క్విజ్‌లు, ఆటలు, పాటలతో అన్ని వర్గాలను అలరిస్తూ.. ఎన్నో విజయశిఖరాలను అధిరోహించింది.

తెలుగు ప్రజల గుండెచప్పుడుగా..

ఇక తెలుగునాట అమితంగా విశ్వసించే ఈటీవీ-న్యూస్‌.. నిజాయతీగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారింది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విశేషాలతో మారుతున్న ప్రపంచానికి... దర్పణం పడుతోంది. రైతన్నలకు అండగా నిలుస్తున్న అన్నదాత కార్యక్రమంతో పల్లెపల్లెలో సుప్రభాతమై భాసిస్తోంది ఈటీవీ. లెక్కలేనన్ని మరెవరూ ఎక్కలేనన్ని విజయాలతో దూసుకెళ్తున్న ఈటీవీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. రజతోత్సవాన్ని జరుపుకుంటోంది.

ఆనందాలకు ఆహ్వానం, సంతోషాలకు స్వాగతం

రజతోత్సవ వేళ సినీనటి సుహాసిని... జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ఆరంభించారు. ఆనందాలకు ఆహ్వానం, సంతోషాలకు స్వాగతం పలికారు.

విప్లవాత్మక మార్పులతో..

ఈటీవీ 25ఏళ్ల పండుగలో పాల్పంచుకున్న కథానాయకుడు చిరంజీవి... కేక్‌ కోసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఈటీవీ యాజమాన్యానికి, సాంకేతిక సిబ్బందికి, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. విప్లవాత్మక మార్పులతో.. 24గంటలూ టీవీని వీక్షించేలా చేసిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని చిరంజీవి పేర్కొన్నారు.

తిరుగులేని వినోదాలు అందిస్తుంది..

ఈటీవీ రజతోత్సవం జరుపుకుంటున్న వేళ... ప్రేక్షకులకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం దేశ విదేశాల్లోని తెలుగువారిదని... ఈ ఘనత, చరిత ప్రేక్షకులదేనంటూ మనసారా ధన్యవాదాలు తెలిపారు. సకుటుంబ సమేతంగా ఛానల్‌ను చూసేలా ప్రయాణం ప్రారంభించిన ఈటీవీ... ఇప్పటికీ అదే నిబద్ధతతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఇక ముందూ తెలుగువారికి ఎప్పటిలా ఈటీవీ తిరుగులేని వినోదాలు అందిస్తుందని మాట ఇచ్చారు.

అప్రతిహత విజయాలతో..

సంచలనాల ఈటీవీ 25 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవటం సంతోషకర విషయమన్న కథానాయకుడు నాగార్జున... ఆది నుంచి ఛానల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇకముందు ఈ ప్రస్థానం... అప్రతిహత విజయాలతో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. సంతోషాలకు నెలవైన ఈటీవీ వెండిపండుగ సంబరాలు... ఏడాదంతా ఏదో ఓ రూపంలో వినోదాల గగనాలలో వీక్షకుల్ని విహరింపజేస్తూనే ఉంటాయి.

ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details