ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Etela: 'హుజూరాబాద్​లో ఓడించేందుకు నీఛ రాజకీయాలు చేస్తున్నారు' - telangana varthalu

తెలంగాణలోని హుజూరాబాద్​ ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది భారతీయ జనతా పార్టీనే అని ఈటల రాజేందర్​ వెల్లడించారు. రాష్ట్రంలో అణచివేత ధోరణికి చరమగీతం పాడాలని హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. హుజూరాబాద్​లో తనను ఓడించేందుకు కేసీఆర్​ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

'హుజూరాబాద్​లో ఓడించేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారు'
'హుజూరాబాద్​లో ఓడించేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారు'

By

Published : Jun 24, 2021, 6:34 PM IST

మాట్లాడుతున్న ఈటల రాజేందర్

తెలంగాణలో అణచివేత ధోరణికి చరమగీతం పాడాలని హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. హుజూరాబాద్​లో గెలిచేది భాజపాయేనని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడ ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి కేసీఆర్​ ఆలోచిస్తుంటారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్​లో తనను ఓడించేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

గెలిచేది భాజపానే..

ఈ నియోజకవర్గంలో ప్రజలంతా రాజకీయ విజ్ఞత కలిగిన వారు. జరిగిన పరిణామాలు, కేసీఆర్​ నాయకత్వంలో ఏకపక్ష నిర్ణయాలు, అణచివేత ధోరణులు అందరికి అర్థమైంది. ఇలాంటి అణచివేతకు, దుర్మార్గాలకు, నియంతృత్వ పద్ధతులకు చరమగీతం పాడాలని హుజూరాబాద్​ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచే జెండా కాషాయ జెండా.. గెలిచే గుర్తు కమలం గుర్తు. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

ఈటలకు భాజపా అండగా ఉంది: జితేందర్​ రెడ్డి

ఈటల రాజేందర్​కు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని భాజపా నేత జితేందర్​ రెడ్డి అన్నారు. ఈటల లేకపోతే ఆనాడు తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన పేర్కొన్నారు. తెరాస కోసం ఆయన ఎంతో కష్టపడినా... పార్టీ నాయకత్వం ఆయనకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రజలంతా ఈటల రాజేందర్​కు అండగా ఉన్నారని జితేందర్​ రెడ్డి వెల్లడించారు.

ప్రజలే నిర్ణయించుకోవాలి: రఘునందన్​రావు

ప్రజలకు ఎలాంటి పాలన కావాలో వారే నిర్ణయించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. ప్రజాస్వామ్య పాలన కావాలో లేక గడీల పాలన కావాలో వారే తేల్చుకోవాలని సూచించారు. హుజూరాబాద్​ ప్రజలు భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి:ట్విట్టర్‌ ఎండీకి హైకోర్టులో ఊరట

ABOUT THE AUTHOR

...view details