తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ పోరాటంలో మొక్కవోని దీక్షతో పోరాడానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. భాజపాలో చేరిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. భాజపాలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని భావించామని.. మేధావుల సూచనలు తీసుకుంటామని మొదట్లో కేసీఆర్ చెప్పారన్నారు. అనంతరం అనేకమంది మేధావులకు కేసీఆర్ అపాయిట్‌మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం అనేక అవమానాలు భరించామన్నారు.
పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటే మంచిది కాదని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. 90 సీట్లు గెలిచిన తర్వాత కూడా 3 నెలలు కేబినెట్ రూపొందించలేదన్నారు. సంపూర్ణ మెజారిటీ వచ్చాక కూడా 3నెలలు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నేనొక్కడినే పాలిస్తే బావుండని భావించే వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ ఏనాడూ ప్రజాస్వామ్య వేదికలను గౌరవించలేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలను లాక్కుంటే ఆనాడే విమర్శించామని ఈటల స్పష్టం చేశారు. సంపూర్ణ మెజారిటీ ఉన్నా కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించారని.. కేసీఆర్‌ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వమని మండిపడ్డారు. ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మంత్రులు గుండెలపై చేయివేసుకుని చెప్పాలని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను కట్టేవారికి రైతు బంధు ఎందుకు అని తాను ప్రశ్నించానని ఈటల వెల్లడించారు.