ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2020, 11:07 AM IST

ETV Bharat / city

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లలో భారీ కోత పడే అవకాశం!

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లలో భారీ కోత పడనుంది. జేఎన్​టీయూ అనంతపురంలో.. దాదాపు 5వేల సీట్లు తగ్గనుండగా.. 23 కళాశాలలకు ఈ సారి ప్రవేశాలు లేనట్లే కనిపిస్తోంది. జేఎన్​టీయూ కాకినాడ పరిధిలో 11 కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇవాళ జేఎన్​టీయూ, కాకినాడ పాలకవర్గం మరోసారి సమావేశం కానుంది.

Engineering Seats in Andhra Pradesh
Engineering Seats in Andhra Pradesh

నిన్న జరిగిన అనంతపురం, కాకినాడలోని జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పాలకవర్గాల ఉమ్మడి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 25 శాతంలోపు ప్రవేశాలు, విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు రుసుము బకాయిలు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు సమర్పించిన ఆదాయ, వ్యయాల వ్యత్యాసాల ఆధారంగా మూడు నివేదికలు రూపొందించారు. జేఎన్​టీయూ అనంతపురం సమగ్ర నివేదికలను రూపొందించడంతో పాలకవర్గంలో దాదాపుగా అన్నింటికి ఆమోదం తెలిపారు. జేఎన్​టీయూ కాకినాడ నివేదికలు సమగ్రంగా లేవంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఫలితంగా ఇంజినీరింగ్‌ సీట్లలో భారీ కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి.

జేఎన్​టీయూ అనంతపురం పరిధిలో ఈ ఏడాది 23 ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రవేశాలు నిలిపివేయనున్నారు. మరో 17కళాశాలలకు సీట్లలో కోత విధించనున్నారు. పాలకవర్గ సమావేశానికి సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ 23కళాశాలల్లో.. 7కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే స్వచ్ఛంద మూసివేతకు అంగీకారం తెలిపాయి. ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మొత్తం 41వేల సీట్లు ఉండగా.. ఈసారి దాదాపు 5వేల సీట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ సంఖ్యను ఇంకా పెంచాలని మొదట భావించినా.. ఎక్కువ సీట్లు కోత విధిస్తే ప్రవేశాలకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో 5వేల సీట్లకు కోత వేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

జేఎన్​టీయూ కాకినాడ పరిధిలో ఇప్పటికే 11 కళాశాలలు స్వచ్ఛందంగా ప్రవేశాలను నిలిపివేసేందుకు అంగీకరించాయి. ఈ జాబితానే విశ్వవిద్యాలయ అధికారులు పాలకవర్గంలో సమర్పించారు. ఈ వర్సిటీ పరిధిలో దాదాపు 30-35 కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు లేనట్లు ఉన్నతాధికారులు అంచనా వేశారు. వర్సిటీ అధికారులు మాత్రం 11కళాశాలల్లోనే ప్రవేశాలు నిలిపివేయాలని జాబితా సమర్పించినట్లు తెలుస్తుంది. నివేదికలో కొన్ని లోపాలు ఉండడంతో పూర్తిస్థాయిలో నివేదికలను మరోసారి రూపొందించాలని పాలకవర్గంలో వర్సిటీ అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్‌ సీట్లలో కోత పడితే విద్యార్ధుల ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తే.. అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details