ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Engineering Counselling: ఇంజినీరింగ్ కొత్త విధానమేంటి? కౌన్సెలింగ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

By

Published : Aug 31, 2021, 10:45 AM IST

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం సెప్టెంబరు 9 వరకు ఆన్​లైన్​లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అయితే వివిధ దశల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనే విషయాలను కౌన్సిలింగ్ క్యాంపు అధికారి బి.శ్రీనివాస్​తో ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలుసుకుందాం..

Engineering Counselling
Engineering Counselling

Engineering Counselling
  • కౌన్సిలింగ్ రుసుము ఎంత చెల్లించాలి?

తెలంగాణలో ఎంసెట్​లో అర్హత పొందిన అభ్యర్థులు ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1200 చెల్లించాలి. ధ్రువపత్రాల పరిశీలన కోసం 36 హెల్ప్​లైన్ కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమకు నచ్చిన కేంద్రం, తేదీ, సమయాన్ని ఆన్​లైన్​లో స్లాట్ బుక్ చేసుకోవాలి.

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంత సమయం పడుతుంది.?

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుంది. ర్యాంకు, ఇంటర్ వివరాలను తాము ఆన్​లైన్​లో తెప్పించుకుంటాం. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మీ-సేవ నెంబర్లు ఇస్తే చాలు. వాటిని కూడా ఆన్​లైన్​లోనే ధ్రువీకరించుకుంటాం. స్థానికత ధ్రువీకరణ కోసం బోనోఫైడ్ సర్టిఫికెట్లను కేంద్రాల్లో పరిశీలిస్తాం. ఆదాయ ధ్రువీకరణ పత్రం 2021-22లో చెల్లుబాటయ్యేది మాత్రమే ఉండాలి.

  • విద్యార్థికి కరోనా వస్తే ఎలా?

ధ్రువపత్రాల పరిశీలన సమయంలో విద్యార్థికి కరోనా సోకితే.. వారి తల్లిదండ్రుల్లో ఒకరు వచ్చినా సరిపోతుంది. కరోనా సోకినట్లు వైద్య ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన వివరాలు ఎంసెట్ వెబ్​సైట్​లోనూ పొందుపరిచాం.

  • వెబ్ ఆప్షన్ల నమోదులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

వెబ్​ఆప్షన్ల నమోదు ప్రవేశాల ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ. కళాశాల, కోర్సును ఎంచుకునేందుకు తొందరపడవద్దు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొంతైనా కసరత్తు చేయాలి. అవసరమైతే సలహాలు తీసుకోవాలి. గతేడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందనే వివరాలు వెబ్​సైట్​లో ఉన్నాయి. అదేవిధంగా వీలైనన్నీ ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలి. ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వకపోతే సీటు రాకపోవచ్చు. గతంలో ఈ విధంగా కొందరు విద్యార్థులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏయే కళాశాలల్లో ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో సెప్టెంబరు 4లోగా ఖరారవుతాయి.

  • సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి?

సెప్టెంబరు 15న కన్వీనర్ కోటా మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తాం. ఎస్ఎంఎస్ ద్వారా విద్యార్థులకు సీటు కేటాయింపు వివరాలు పంపిస్తాం. వెబ్ సైట్ నుంచి సీటు కేటాయింపు ఉత్తర్వులను డౌన్​లోడ్ చేసుకోవాలి. ఆ సమయానికి సెల్ఫ్ రిపోర్టింగ్ లింక్ అందుబాటులోకి వస్తుంది. ఆన్​లైన్​లోనే బోధన రుసుము చెల్లించి కాలేజీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. పాక్షిక ఫీజు రీఎంబర్స్​మెంటు అర్హత ఉన్న వారు... మిగతా బోధన రుసుమే చెల్లించాలి. పూర్తి రీఎంబర్స్​మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు బోధన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆన్​ లైన్​లో కచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయక పోతే మాత్రం కేటాయించిన సీటు రద్దవుతుంది.

  • రెండో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు?

రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. జేఈఈ అడ్వాన్స్​డ్ తర్వాత రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుంది. మొదటి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత రెండో విడతలో పాల్గొనవచ్చు. అయితే మరింత మెరుగైన సీటు కావాలనుకునే వారే రెండో విడతలో పాల్గొనాలి. రెండో విడతలో ఆప్షన్ ఇచ్చిన సీటు వస్తే.. మొదటి విడతలో వచ్చిన సీటు ఆటోమేటిక్​గా రద్దయిపోతుంది.

  • కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలా?

కాలేజీకి ప్రత్యక్షంగా ఎప్పుడు వెళ్లి చేరాలో ఇంకా తేదీ ఖరారు కాలేదు. కాలేజీలో టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలి. మిగతా ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తారా?

ఈ ఏడాది నుంచే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుతాయి. వెబ్​సైట్​లో దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి. మిగతా రిజర్వేషన్లు తగ్గవు. ఈడబ్ల్యూఎస్ కోసం కన్వీనర్ కోటాలో 10శాతం సీట్లు సూపర్ న్యూమరరీ సీట్లు అదనంగా వస్తాయి.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details