పెట్టుబడులు, అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడిన హీరాగోల్డ్ కేసులో ఈడీ కొరడా ఝుళింపించింది. ప్రజల నుంచి మోసపూరితంగా వసూలు చేసిన సొమ్ముతో కూడబెట్టుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ వేగవంతం చేసింది. హైదరాబాద్ షేక్‌పేటలోని హీరాగోల్డ్ వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్‌కు చెందిన రూ. 70 కోట్ల 81 ప్లాట్లను ఇవాళ స్వాధీనం చేసుకుంది. షేక్‌పేట ఎస్ఏ కాలనీలో నీలాంచల్ సంస్థకు చెందిన వివాదాస్పద భూములను ఎస్ఏ బిల్డర్స్ యజమాని సయ్యద్ అక్తర్ నుంచి నౌహీరాషేక్ అధిక ధరలతో కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. నౌహీరా షేక్ జైలుకు వెళ్లడం వల్ల... ఆ భూములను మళ్లీ అమ్మేస్తున్నట్టు దర్యాప్తు బృందం పసిగట్టింది. తేరుకున్న ఈడీ బృందం దిల్లీలోని ప్రాధికార సంస్థ అనుమతితో... షేక్‌పేట రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈడీ అదికారులు ఇవాళ తమ అధీనంలోకి తీసుకొని బోర్డులు పెట్టారు.
హీరా గోల్డ్ కేసులో దర్యాప్తు వేగవంతం.. ఆస్తులు స్వాధీనం - హీరా గోల్డ్ ఆస్తుల స్వాధీనం
హీరా గోల్డ్ కేసులో ఆస్తుల స్వాధీనం ప్రక్రియను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. అక్రమ సొమ్ముతో హైదరాబాద్‌లో కూడబెట్టిన ఆస్తులను ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే రూ.300 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ... మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తోంది.
వివిధ పథకాల పేరుతో అధిక వడ్డీ ఆశచూపి నౌహీరాషేక్ దేశవ్యాప్తంగా లక్ష 72వేల మంది నుంచి దాదాపు 5 వేల 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అభియోగం ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ... దర్యాప్తు చేస్తోంది. ప్రజల నుంచి స్వీకరించిన సొమ్మును ఎక్కడికి మళ్లించారనే కోణంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తూ.. అక్రమాస్తులను గుర్తిస్తోంది.
హీరాగ్రూప్లో 24 కంపెనీలు, దేశవ్యాప్తంగా 182 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి విదేశాల్లోనూ 10 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు తేలింది. నౌహీరాషేక్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, దిల్లీలో 277 కోట్ల 29 లక్షల రూపాయల విలువైన 96 స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేశారు. బ్యాంకుల్లోని 22 కోట్ల 69 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. నౌహీరా షేక్‌తో పాటు.. ఆమె బినామీల పేరిట ఉన్న స్థిర, చరాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ఈడీ విచారణ ముమ్మరం చేసింది.