వినియోగదారుల షేర్లను తనఖా పెట్టడం ద్వారా కార్వీ సంస్థ సేకరించిన వెయ్యి కోట్ల నిధులను ఎక్కడికి మళ్లించింది.. అనే అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లోతుగా ఆరా తీయనుంది. సంస్థ ఛైర్మన్ పార్ధసారథిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. కోర్టు అనుమతి లభించిన తర్వాత ఆయనను కస్టడీలోకి తీసుకొని నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టనుంది. మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో కార్వీ సంస్థ ప్రతినిధులు స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేలింది. సంస్థతో పాటు ప్రతినిధుల పేర్లపై ఉన్న ఆస్తులను కూడా బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందినట్టు గుర్తించారు.
KARVY CASE: కార్వీ ఎండీ పార్ధసారథి విచారణకు అనుమతి కోరిన ఈడీ - కార్వీ కేసు తాజా వార్తలు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ వేల కోట్ల నిధుల అక్రమాల వ్యవహారం ఆరా తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ సంస్థ ఛైర్మన్ పార్ధసారథిని విచారించేందుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే... మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. నిధులు ఎక్కడికి మళ్లించారనే అంశంపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.
పోలీసులకు సుమారు వెయ్యి కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే అందాయి. కార్వీ సంస్థ దాదాపు రెండు వేల కోట్ల విలువ చేసే షేర్లపై అక్రమ లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్వీ చేసిన స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలను ఈడీ పరిశీలించనుంది. పార్ధసారథిని విచారిస్తే పూర్తిస్థాయిలో మరిన్ని వివరాలు బయటపడతాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఆర్ధిక లావాదేవీలను లోతుగా పరిశీలిస్తే నిధుల మళ్లింపుకు సంబంధించి కీలక విషయం బయటపడుతుందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా గుర్తించిన ఆస్తులనూ జప్తు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: పాక్‌లో టి-తాలిబన్ ఆత్మాహుతి దాడి