ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరో కేసులో విచారణ మొదలైంది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఇప్పటికే విచారణ దశలో ఉండగా... ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్షీట్నూ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలకు సంబంధించి ఈడీ గతంలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ... కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం వెనక్కు పంపింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా... గతనెల 23న విచారణ చేపట్టింది.
వీరిపై అభియోగాలు..
సీఎం జగన్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైకాపా ఎమ్మెల్యే వీవీ కృష్ణప్రసాద్, ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి, బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి జితేంద్రవీర్వానీ, ఇందూ ప్రాజెక్ట్స్, సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది.
విజయసాయిరెడ్డికి రిలీఫ్!
ఇప్పటివరకు దాఖలైన సీబీఐ, ఈడీ అభియోగపత్రాలన్నింటిలోనూ రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఈ కేసులో ఈడీ తొలగించింది. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు లేవు. గృహనిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో జగన్ సహా 14 మంది నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఈడీ 11 మందినే నిందితులుగా తెలిపింది. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ జరిపింది. 117 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను 2018 జనవరిలో తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అభివృద్ధి చేయని భూములు సహా వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీస్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.