ఉచిత విద్యుత్ పథకంలో చేపట్టిన సంస్కరణలను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతులను తప్పుదారి పట్టించేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుత ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత పక్కాగా అమలు చేయటానికి నగదు బదిలీ విధానం ప్రతిపాదించామని మంత్రి అన్నారు. రైతులు, కౌలుదారులపై పైసా భారం పడకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయ కరెంటు బిల్లుల బకాయిల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారని... ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు.
రాత్రివేళ రైతులు పొలాల్లోకి వెళ్లి ప్రమాదానికి గురైన సందర్భాలున్నాయని మంత్రి అన్నారు. ఆ ప్రభుత్వం మిగిల్చిన రూ.7171 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించినట్లు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యమైనా సరఫరా నిలపకుండా ఆదేశాలిచామని మంత్రి తెలిపారు. విద్యుత్ పంపిణీ కంపెనీల్లో జవాబుదారీతనం పెంచామని.. ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ యథాతథంగా పథకం కొనసాగిస్తామ’ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. మొత్తం ప్రక్రియలో కౌలు రైతులకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని అన్నారు. కౌలు రైతులు ప్రస్తుతం ఎలా అయితే ఉచిత విద్యుత్ పొందుతున్నారో అదేవిధంగా ఇక మీద కూడా ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ప్రభుత్వం..!