కరోనా నియంత్రణ కోసం దేవాలయాల్లో తీసుకోవాల్సి జాగ్రత్తలపై దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఈ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. కార్యనిర్వహణాధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
- భక్తులు ఆలయాల్లోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లు శుభ్రపర్చుకునేందుకు సబ్బులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- థర్మల్ గన్ తో భక్తులను పరిశీలించిన తర్వాతే దేవాలయ ప్రాంగణంలోనికి అనుమతించాలి.
- ఎన్.ఆర్.ఐ, విదేశీ భక్తులు దేశానికి వచ్చిన 14రోజుల లోపు ఆలయంలోపలకు రావొద్దని మైక్ ద్వారా ప్రకటించాలి.
- భక్తులు ఎవరైనా కరోనా లక్షణాలతో ఉన్నట్లు అనుమానం వస్తే 104కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపేలా చూడాలి.
- ఆలయ క్యూలైన్లలో భక్తులు ఒకరొకరికి మధ్య 3 అడుగుల దూరం ఉండేలా చూడాలి.
- కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి.
- దేవాలయాలకు అనుసంధానంగా ఉన్న నదులు, ఏరులు, కోనేర్ల వద్ద సామూహిక స్నానాలకు అనుమతించరాదు.
- ఆలయ ప్రాంగణంలో భక్తులు చీదటం, ఉమ్మటం చేయరాదని ప్రకటించాలి.
- భక్తులు పెద్దసంఖ్యలో గుమికూడేలా ఎలాంటి ఉత్సవాలు జరపరాదు.
- భక్తులు లేకుండా శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
- రాబోయే ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే చేయాలి.
- అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేయాలి.. కేవలం వైదిక సిబ్బంది మాత్రమే నిర్వహించాలి.
- భక్తులందరికీ కేవలం లఘు దర్శనం మాత్రమే కల్పించాలి.
- ఆలయ ప్రాంగణాల సమీపంలో పొంగళ్లు, నివేదనల తయారీ నిలిపివేయాలి.
- స్వామి, అమ్మవార్లకు జరిగే పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయాలి.
- 60ఏళ్ల పైబడిన వారు, 10ఏళ్ల లోపు పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, వికలాంగులు తమ యాత్రలను వాయిదా వేసుకోవాలి.
- ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ తో క్యూలైన్లను ప్రతి రెండు గంటలకు శుభ్రం చేయాలి
- అన్నప్రసాద కేంద్రాల్లో వితరణ నిలిపివేయాలి. సాంబార్ రైస్, పులిహోర, దద్దోజనం ప్యాకెట్లు భక్తులకు అందించాలి.
- కేశఖండనశాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, సహాయ కమిషనర్ హోదా ఉన్న దేవాలయాల్లో అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి.
- ఆలయంలో పోగయ్యే చెత్తను రెండు కవర్లలో పెట్టి బ్లీచింగ్ చల్లి.. ఆ తర్వాతే నిర్వీర్యం చేయాలి.
- లోక రక్షణ, ప్రజారోగ్యం కోసం అన్ని ఆలయాల్లో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సుదర్శనహోమాలు నిర్వహించాలి.
- రోజూ ఉదయం, సాయంత్రం గోపంచకంతో ఆలయాలను శుభ్రపర్చాలి.
- వైద్యశాఖ సిబ్బంది, జిల్లా కలెక్టరేట్లతో సంప్రదింపులు చేస్తూ కరోనా నిరోధానికి చర్యలు చేపట్టాలి.