ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం పునరుద్దరణకు రూ.3 కోట్లు కేటాయింపు - funds released for Rama Tirtham temple rehabilitation

రామతీర్థం రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, పునః నిర్మాణానికి మూడు కోట్ల రూపాయులు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. పండితుల స‌ల‌హాల మేరకు... వైఖాస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆల‌య అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివ‌రించారు. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను మంత్రి అదేశించారు.

minister Velampally Srinivasa Rao
రామతీర్థం పునర్ధురణ కోసం మూడు కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన మంత్రి

By

Published : Jan 19, 2021, 1:53 PM IST

విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ కోసం మూడు కోట్ల రూపాయులు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాల‌యంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న ఆల‌య నిర్మాణం పూర్తి రాతి క‌ట్టడాల‌తో జ‌రగనున్నట్లు మంత్రి వెల్లడించారు. కోదండ రాముడి విగ్రహాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌యారు చేసి అంద‌జేస్తుందని... అలాగే రామ‌తీర్థం మెట్ల మార్గం స‌రిచేయ‌డం పాటుగా కొత్త మెట్లను నిర్మిస్తామని వివరించారు. దేవాల‌య ప‌రిస‌రాల విద్యుత్ దీపాలంక‌ర‌ణ చేయ‌డం, శా‌శ్వత నీటి వ‌స‌తి, కోనేటిని శుభ్రపరచడం... కోనేరుకు గ్రిల్స్ ఏర్పాటు చేయ‌టం, ప్రాక‌ర నిర్మాణం, హోమ‌శాల‌, నివేద‌నశాల నిర్మాణాలు కూడా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తుల మనోభావాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ముందే కొత్త రథాన్ని సిద్ధం చేశామని చెప్పారు. ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు నూత‌న ర‌థానికి వైఖాస ఆగమ సాంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణాహుతి, ర‌థ‌ ప్రతిష్ట జ‌రుగుతుంద‌ని వివరించారు. 22వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనంత‌రం 23న కల్యాణోత్సవ రథం ఊరేగింపు క‌నుల పండుగగా జరపాలని భావిస్తున్నామని అన్నారు.

అధికారులతో సమీక్ష అనంతరం అర్చక స‌మాఖ్య ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం ఆదేశాలతో అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు చేప‌డతామని వెల్లడించారు. కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం 5 వేల రూపాయలు నుంచి10 వేల రూపాయలు పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 10 వేల రూపాయిలు ఉన్న భృతిని 16 వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామని, ధూపదీప నైవేద్య పథకానికి 3,600 రూపాయలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీడీఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచుతామని వెల్లడించారు.

ఇదీ చదవండీ..పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

ABOUT THE AUTHOR

...view details