కొన్ని రాజకీయ పార్టీలు... తమ ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న కుట్రలను ఛేదించాలని అధికారులకు సూచించారు. కావాలనే కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో పనిచేసే అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, రిజనల్ జాయింట్ కమిషనర్ తరుచుగా తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలని మంత్రి ఆదేశించారు. అక్కడ గ్రామ కమిటీలతో... స్థానికులతో సమావేశమై... వారి అభిప్రాయాలను, సూచనలను పాటిస్తూ దేవాలయాల అభివృద్దికి కృషి చేయాలని సూచించారు.
'మన గుడి - మన బాధ్యత... అంతా కలిసి పనిచేద్దాం'
మన గుడి - మన బాధ్యతగా... అంతా కలిసి పనిచేయడం ద్వారా ఆలయాలు అభివృద్ధిలోకి తీసుకురావొచ్చని... దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అధికారులు దేవాలయాలకు వన్నె తీసుకువచ్చే విధంగా పనిచేయాలని... అతిథిగృహాలలో శుభత్ర పాటించాలని కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావుతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేవాలయాలు, ప్రాంగణం, రథాల భద్రత విషయంలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ దేవాలయాలతో పాటు ప్రయివేటు దేవాలయాల విషయంలోనూ ఆయా కమిటీల వారితో చర్చించాలని చెప్పారు. ఆలయాల భద్రత విషయంలో స్థానికులు, పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆలయాల పరిరక్షణలో ఎవరు ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవాలయాలకు అనుబంధంగా ఉన్న అతిథి గృహాలను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమెహన్, ఎస్ఈ శ్రీనివాసరావుతో పాటు 13 జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, నలుగురు డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు