ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేవాదాయ శాఖ నిధులను అమ్మఒడికి మళ్లిస్తున్నారు'

దేవాదాయశాఖకు చెందిన నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించడానికి ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిల్​పై హైకోర్టు విచారణకు నిరాకరించింది. దేవాదాయశాఖకు చెందిన నిధులని చెప్పడానికి ఉన్న ఆధారాలేమిటని పిటిషనర్​ను ప్రశ్నించింది. పిటిషనర్ అందించిన ఆధారాలతో సంతృప్తి చెందడంలేదని తెలిపింది. అదనపు వివరాలు సమర్పించడానికి రెండు వారాలు గడువు ఇచ్చింది.

endowment funds divert to Amma Vodi.. petition filed in HC
'దేవాదాయ శాఖ నిధులను అమ్మఒడికి మళ్లిస్తున్నారు'

By

Published : Aug 28, 2020, 4:18 PM IST

Updated : Aug 29, 2020, 3:04 AM IST

దేవాదాయశాఖకు చెందిన రూ.24.24 కోట్లు ' అమ్మఒడి ' పథకానికి మళ్లించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. అవి దేవాదాయశాఖకు చెందిన నిధులని చెప్పడానికి ఉన్న ఆధారాలేమిటని పిటిషనర్​ను ప్రశ్నించింది. ప్రాథమికంగా పిటిషనర్ వాదనలతో సంతృప్తి చెందడం లేదని తెలిపింది. అదనపు వివరాలు సమర్పించడానికి పిటిషనర్ తరపు న్యాయవాది రవిప్రసాద్ గడువు కోరడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

అమ్మఒడి పథకానికి రూ.24. 24 కోట్లు విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ రెవెన్యూ ( దేవాదాయ శాఖ కార్యదర్శి ఈ ఏడాది జనవరి 6 న జారీచేసిన జీవో 18 ని సవాలు చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అమ్మ ఒడి పథకం కోసం దేవాదాయశాఖకు చెందిన రూ . 24.24 కోట్లు మళ్లించేందుకు జీవో జారీచేశారన్నారు. మళ్లింపునకు అనుమతించడానికి వీల్లేదనే నిబంధన ఎక్కడుందో చూపాలంటూ ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ దేవాదాయ చట్టంలోని సెక్షన్ 72 లోని నిబంధనలను చదివి వినిపించారు . ' ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్‌కు రూ .24.24 కోట్ల నిధుల విడుదల నిమిత్తం పరిపాలన అనుమతులిస్తూ జీవో జారీచేశారన్నారు.

ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. ఏజీ బదులిస్తూ, బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ దేవాదాయశాఖ కింద పనిచేస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి దేవాదాయశాఖకు నిధులు కేటాయించారన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పరేషన్ ద్వారా సంబంధిత సామాజిక వర్గాల తల్లులకు అమ్మఒడి నిధులు పంపిణీ జరుగుతుందన్నారు. అవి దేవాదాయశాఖకు చెందిన నిధులు కావన్నారు. సరైన ఆధారాలు లేకుండా పిటిషనర్ పిల్ దాఖలు చేశారన్నారు. అవి దేవాదాయశాఖకు చెందిన విధులని చెప్పడానికి పిటిషనర్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వీధుల్లో చేసే వ్యాఖ్యల ఆధారంగా పిల్ వేయడానికి వీల్లేదన్నారు. పిల్లు దాఖలు చేయడాన్ని తామేమీ వ్యతిరేకించడం లేదుకాని ఆధారాలు లేకుండా చేయడం సరికాదన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ఆ నిధులు దేవాదాయశాఖకు చెందినవి ఎలా అవుతాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులని ఏజీ చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఆ నిధులు దేవాదాయశాఖకు చెందినవని ఆఫిడవిట్లో పేర్కొన్నట్లు న్యాయవాది తెలపగా ఆ వాదనలతో ప్రాథమికంగా సంతృప్తి చెందడం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో అదనపు వివరాలతో దస్త్రం దాఖలు చేయడానికి అనుమతివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా ధర్మాసనం అనుమతిచ్చింది.

ఇదీ చదవండి:

మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి

Last Updated : Aug 29, 2020, 3:04 AM IST

ABOUT THE AUTHOR

...view details