FIXED DEPOSITS: రాష్ట్రంలోని వివిధ ఆలయాలు వాటి అదనపు (సర్‌ప్లస్) ఫిక్స్‌డ్ డిపాజిట్లను రద్దుచేసి (డ్రాచేసి) అయినా సరే దేవాదాయశాఖలో వివిధ నిధులకు డబ్బులు జమచేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నెల 15లోగా అంతా కట్టాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. కొన్నిచోట్ల అవసరమైతే అన్నదానం ఎఫ్‌డీఆర్‌లు కూడా డ్రా చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆలయాల ఈవోలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖ పరిధిలో రూ.2 లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు, మఠాలు, ధార్మిక సంస్థలు తమ ఆదాయంలో 9% సర్వ శ్రేయోనిధి (సీజీఎఫ్)కి, 8% దేవాలయ పరిపాలననిధి (ఈఏఎఫ్)కి చెల్లించాలి. రూ.30 లక్షలపైన వార్షికాదాయం ఉన్న ఆలయాలు వీటితోపాటు 3% అర్చక, ఉద్యోగుల సంక్షేమనిధికి, 1.5% ఆడిట్ ఫీజుగా చెల్లించాలి. 1,776 ఆలయాలు ఆయా నిధుల కింద ఈ ఏడాది మార్చి చివరికి రూ.353 కోట్లు జమచేయాలి. ఏప్రిల్, మే నెలల్లో రూ.42 కోట్లు చెల్లించారు. మిగిలినవి ఈ నెల 15లోగా చెల్లించాలని ఈవోలకు కమిషనర్ తుదిగడువు విధించారు.
ఆలయాలకు భక్తుల నుంచి వచ్చే ఆదాయంలో ఖర్చులుపోను, మిగిలిన నిధులను భవిష్యత్తు అవసరాల కోసం అదనపు ఎఫ్‌డీఆర్‌లు చేస్తుంటారు. ఆలయపరిధిలో వివిధ నిర్మాణాలు, ఉత్సవాలు, ఇతర ఖర్చుల కోసం వీటిని జాగ్రత్తచేస్తారు. ఇప్పుడు వీటిని డ్రాచేసి, ఆయా నిధులకు జమచేయాలని కమిషనరేట్ నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే అన్నదానం ఎఫ్‌డీఆర్‌ల నుంచీ డ్రా చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నట్లు తెలిసింది. నిధుల చెల్లింపుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లను డ్రా చేయాలని ఆదేశించడంపై ఈవోలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.