ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 29, 2021, 2:34 AM IST

ETV Bharat / city

'దేవదాయ ట్రైబ్యునల్​కు ఛైర్మన్​ను నియమించండి'

రాష్ట్ర దేవదాయ శాఖ ట్రైబ్యునల్​కు తిరిగి ఛైర్మన్​ను ఏర్పాటు చేయాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవదాయ చట్టం సెక్షన్ 162(3) ప్రకారం ట్రైబ్యునల్​కు ఛైర్మన్, సభ్యుడు ఉండాలని పేర్కొంది.

endowment chairman
endowment chairman

సాధ్యమైనంత తర్వగా అమరావతిలోని ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ కు తిరిగి ఛైర్మన్‌ను ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఛైర్మన్​ను నియమించకుండా సభ్యుడితో ఏళ్ల తరబడి ట్రైబ్యునల్ కార్యకలాపాలు నిర్వహించడం సరికాదని స్పష్టంచేసింది. దేవదాయ చట్టం సెక్షన్ 162(3) ప్రకారం ట్రైబ్యునల్ కు ఛైర్మన్, సభ్యుడు ఉండాలని పేర్కొంది. వారిద్దరిలో ఒకరి పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు మరొకరు ఉత్తర్వులు ఇచ్చేందుకు చట్టంలోని సెక్షన్ 162(7) తాత్కాలిక వెసులుబాటు మాత్రమే ఇచ్చిందని తెలిపింది. ఛైర్మన్ లేకుండా దేవదాయ డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన సభ్యుడితో సంవత్సరాల తరబడి ట్రైబ్యునల్ నిర్వహణ సరికాదని తేల్చి చెప్పింది.

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల పరిధిలోని తొత్తరమూడి గ్రామ పరిధిలో ఉన్న శ్రీముక్తేశ్వర , మూలేశ్వరస్వామివార్ల దేవస్థానం స్థలం విషయంలో దుకాణాలు, ఇళ్లు నిర్మించుకున్న వారిని ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దేవదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ ట్రైబ్యునల్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్ వేస్తూ దేవదాయ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్ సభ్యుడు .. పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్న పలువురు హైకోర్టును ఆశ్రయించారు . వారి తరపున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపించారు . ఛైర్మన్ లేకుండా జ్యుడీషియల్ వ్యవహారంపై అనుభవం లేని సభ్యుడు ట్రైబ్యునల్ కార్యకలాపాలను ఏళ్ల తరబడి నిర్వహించడం సరికాదన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎండోమెంట్ సభ్యుడు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఛైర్మన్ నియామకం అనంతరం విచారణార్హతతో పాటు , ఇతర అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి అనుబంధ పిటిషన్లు , ఒరిజినల్ దరఖాస్తును పరిష్కరించాలని ట్రైబ్యునల్ ను ఆదేశించారు.

ఇదీ చదవండి:2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం తథ్యం: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details