Chalo Vijayawada పోలీసుల కఠిన ఆంక్షల కారణంగా కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగుల ‘చలో విజయవాడ’ వాయిదా పడింది. సెప్టెంబరు 1న తలపెట్టిన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు 11వ తేదీకి వాయిదా వేసినట్లు సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రోంగల అప్పలరాజు, కరి పార్థసారథి ప్రకటించారు. ‘సీఎం ఇంటి ముట్టడి’ని సైతం విరమించుకున్నట్లు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.మరియాదాస్, ఎం.రవికుమార్ తెలిపారు. తమ ఆందోళనకు పిలుపిచ్చిన రోజు నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రత దృష్ట్యా కార్యక్రమాలను నిలిపివేశామన్నారు.
ఒకటో తేదీన ఉద్యోగులు ఎవ్వరూ విజయవాడకు రావొద్దని, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడంతో దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందర్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. మూడు రోజులు తమ అదుపులోనే ఉంచుకుంటామని హెచ్చరించారు. బైండోవర్ చేసి, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పూచీకత్తు బాండ్లు రాయించుకున్నారు. జిల్లాల సరిహద్దులోనూ ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టారు.
"సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని అదేనెల 11కు వాయిదా వేస్తున్నాం. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేస్తున్నాం. ఉద్యోగులకు ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి, బైండోవర్లు చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ సెప్టెంబరు 1న విజయవాడ వెళ్లవద్దు. సెప్టెంబరు 11న శాంతియుతంగా చలో విజయవాడ నిర్వహించాలి."-ఉద్యోగ సంఘాలు