ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల విధుల్లో పాల్గొంటాం: ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు - AP Panchyati Election News

సుప్రీం ఆదేశాలతో ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టిన ప్రభుత్వం... ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపింది. సంఘాల నేతలతో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌ సమావేశమై... ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఉద్యోగులు తమ ముందు ఉంచిన సమస్యలను ఎస్ఈసీకి వివరిస్తామని స్పష్టం చేశారు. దీంతో.... ఉద్యోగ సంఘాలూ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి.

Employes ready for election duty n AP
సీఎస్​తో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ

By

Published : Jan 27, 2021, 5:13 AM IST


పంచాయతీ ఎన్నికల విధుల్లో తాము పాల్గొంటామని వివిధ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సీఎస్‌ కోరారని, విధి నిర్వహణలో ఇబ్బందుల్లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపాయి. బుధవారం ఎన్నికల కమిషన్‌తో నిర్వహించే సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వివరించాయి.

సీఎస్​తో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ

ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, ఉద్యోగులకు భద్రత కల్పించాలనే కోరామని వెల్లడించాయి. మంగళవారం విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులతో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సహకరించాలని ఆయన కోరినట్లు తెలిసింది. అదే సమయంలో నేతలు సీఎస్‌ ముందు పలు డిమాండ్లను ఉంచారు.

ఎన్నికల విధి నిర్వహణలో ఉద్యోగి కరోనా బారినపడి మరణిస్తే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు, జీవో 985 ప్రకారం ఆరోగ్య సమస్యలున్న వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు మాస్కులు, పీపీఈ కిట్లు తదితర అన్ని సదుపాయాలూ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక దాడులు జరగకుండా భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఎస్‌ఈసీతో సమావేశంలో చర్చించి తప్పకుండా పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విలేకర్లతో మాట్లాడారు.

ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలి

'ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్రంలోని ఉద్యోగులను కోరుతున్నాం. విధినిర్వహణలో ఎవరైనా మరణిస్తే అందుకు ఎస్‌ఈసీనే బాధ్యత తీసుకోవాలి. ఉద్యోగులకు త్వరగా టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్‌ హామీ ఇచ్చారు. టీకా ఇస్తే ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొంటాం.' - చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు

సమస్యలపై ఎస్‌ఈసీని కలుస్తాం

'ఎన్నికల కమిషనరు సమయం ఇస్తే ఉద్యోగుల సమస్యలను వివరిస్తాం. 7 లక్షల మంది ఉద్యోగులకు టీకా ఇచ్చేవరకూ ఎన్నికలను రీషెడ్యూల్‌ చేస్తే బాగుంటుంది. ఉద్యోగులకు టీకా లేదా పీపీఈ కిట్లు ఇస్తే భయం లేకుండా విధులు నిర్వహిస్తారు. స్థానిక ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు.'- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌

ప్రభుత్వం కోరింది.. మేమూ కోరాం

'ఎన్నికల విధులకు సహకరిస్తాం. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం వాయిదా కోరింది కాబట్టి మేం అడిగాం. బలవంతంగా ఎన్నికల విధులు కేటాయించొద్దనే చెప్పాం. సమస్యలు చెప్పినందుకు మాకు రాజకీయాలు ఆపాదించారు. మేం ఎన్నడూ ఎస్‌ఈసీతో విభేదించలేదు. మాపై వ్యాఖ్యలు చేశాకే స్పందించాల్సి వచ్చింది.' - వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌

ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోవద్దు

'పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులను విలన్లుగా చిత్రీకరించారు. రాజకీయ పార్టీలే ఈ పరిస్థితిని సృష్టించాయి. దయచేసి ఉద్యోగ సంఘాలను లక్ష్యంగా చేసుకోవద్దు.' - సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


ఇదీ చదవండి:

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బదిలీ

ABOUT THE AUTHOR

...view details