కరోనా నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాలు తగ్గించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం, మిగతా అన్నీ కేటగిరీల అధికారులు, ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించనున్నారు.
నాలుగో తరగతి, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల్లో 10శాతం.. అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల ఫించన్లలో 50 శాతం మేర కోత విధించనున్నారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు కూడా కోత వర్తించనుంది.
ప్రస్తుతానికి మార్చి వేతనంలోనే!
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన వేతనాల కోతను ప్రస్తుతానికి మార్చి మాసానికే అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మున్ముందు పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలున్నట్లు సమాచారం. కోత విధించిన వేతనాన్ని భవిష్యత్తులో మళ్లీ ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తారా..? లేదా..అనే దానిపై స్పష్టత లేదు.