ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సొమ్ములిచ్చుకో సిఫార్సు లేఖలు పుచ్చుకో.. బాగానే గిట్టుబాటవుతోన్న బదిలీల దందా.. - employees transfers in ap

రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు కోరుకున్న చోటకు వెళ్లేందుకు పలువురు నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సుల లేఖలతో వారు శాఖాధిపతుల కార్యాలయాలకు తరలివస్తున్నారు.

employees transfers became bussiness in ap
employees transfers became bussiness in ap

By

Published : Jun 21, 2022, 3:58 AM IST

రాష్ట్రంలో కొత్త నిబంధన కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా కొత్త పోస్టులో చేరాలంటే ముందుగా ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌ఛార్జీల అనుమతులు తీసుకోవాలనే ‘అనధికారిక’ నిబంధన కొనసాగుతోంది. దాంతో విస్తృతంగా ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారికి బదిలీ అనివార్యం కావడంతో వారంతా తమకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

  • ఉద్యోగులకు ఈసారి కౌన్సెలింగ్‌ లేకపోవడంతో సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. కౌన్సెలింగ్‌ ఉన్నట్లయితే ఖాళీలు తెలియడం వల్ల వాటికి అనుగుణంగా కోరుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో సిఫార్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
  • కీలక శాఖల్లో ప్రాధాన్య పోస్టులు కావాలనుకునే వారికి రూ.లక్షకుపైగా సమర్పించుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • పశుసంవర్ధకశాఖ వైద్యుల పోస్టుల కోసం కొందరు ప్రజాప్రతినిధులు భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.
  • పురపాలకశాఖలో సిఫార్సు లేఖలతో జిల్లాల నుంచి ఉద్యోగులు కొందరు రాష్ట్ర కార్యాలయాలకు వస్తున్నారు. ఉన్నతాధికారులకు తమ వినతులతో పాటు వాటిని అందజేస్తున్నారు.
  • డిప్యూటేషన్లు రద్దు చేసినందున వారుకూడా కోరుకున్న చోటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతల వ్యక్తి గత సహాయకులను సంప్రదిస్తున్నారు. పోస్టును బట్టి లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు.
  • గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) ద్వితీయశ్రేణి నేతలను ఆశ్రయిస్తున్నారు. కోరుకున్నచోట పోస్టింగ్‌ కావాలంటే తృణమో... ఫలమో చెల్లించాలని, ఇప్పటికే ఆ స్థానానికి పోటీ ఉందని నమ్మబలుకుతున్నారు.
  • రిజిస్ట్రేషన్‌ శాఖలో ముందుగానే ఒప్పందాలు జరిగిపోతున్నాయి. ఆదాయం ఎక్కువగా ఉండే ఈ కార్యాలయాల్లో పోస్టింగ్‌లకు డబ్బులు చేతులు మారుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలోనూ అంతర్గత బదిలీల్లో పైరవీలు చేసిన వారికే మంచి పోస్టింగ్‌లు లభిస్తున్నాయి.
  • రెవెన్యూలో ప్రజాప్రతినిధుల ముందస్తు అనుమతి తీసుకున్న వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా వ్యవహారం కొనసాగుతోంది. ఎక్కడ చేరాలన్న ఆ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఆశీస్సులు కావాల్సిందే. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీల్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లకు సిఫార్సు లేఖలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

ఒక్క రోజే 110 లేఖలిచ్చిన గుంటూరు నేత

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత ఒక్క రోజులోనే 110 సిఫార్సు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

  • పొన్నూరు నియోజకవర్గంలో అధికారులు, సిబ్బంది ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు బదిలీ కోరుకుంటున్నారు. అయితే వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడానికి చాలా మంది ఇష్టపడడం లేదని చెబుతున్నారు.
  • వ్యవసాయశాఖలో ఓ ఏడీఏ పోస్టుకు ఓ ఎంపీ ఒకరికి లేఖ ఇవ్వగా.. మరో ఇద్దరు పోటీ పడి ఎమ్మెల్యేల నుంచి లేఖలు తెచ్చుకున్నారు. ఇది చర్చనీయాంశమైంది.
  • గుంటూరు జిల్లా పరిషత్‌లో సూపరింటెండెంట్‌లు, పరిపాలనాధికారుల పోస్టులకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు.
  • కృష్ణా జిల్లా పరిషత్తులో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పేరుతో బోగస్‌ లేఖలు వచ్చినట్లు ఆ శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

ఐదేళ్లకుపైగా ఒకే స్థానంలో లేమంటూ...

కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అంతర్గత విభాగాల్లో ఆన్‌ డ్యూటీ (ఓడీ) విధానంలో రెండు విడతలుగా ఒకే స్థానంలో ఐదేళ్లకుపైగా పని చేస్తున్న వారంతా బదిలీల నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లు పని చేశాక రిలీవై సొంత విభాగానికి వచ్చి రెండు, మూడు రోజులు పని చేశాక మళ్లీ పాత స్థానానికి వచ్చిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు. వీరంతా ఐదేళ్లకుపైగా ఒకే స్థానంలో లేమంటూ బదిలీల నుంచి మినహాయింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో కొందరు ఇంజినీర్లు ఈ విధంగా బదిలీ నుంచి తప్పించుకుంటున్నారు. ఈ సమాచారం ఆర్థిక శాఖ వరకు వెళ్లిందని చెబుతున్నారు.


ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details