Cps in AP :జగన్ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని.ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పడు అన్న మాటలివి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏప్రిల్ 29వ తేదిన "సీఎంగా సీపీఎస్‌ను రద్దుచేయాలంటే నిమిషం పని. మరి ఎందుకింత ఆలోచిస్తున్నాం? ఓపీఎస్ అమలైతే మోయలేని భారం పడుతుంది. పింఛన్ల భారం ఉద్యోగుల జీతాలనూ దాటేసి, మోయలేని స్థాయికి చేరుతుంది. సీపీఎస్ ద్వారా వస్తున్న దానికన్నా 70% ఎక్కువగా వచ్చేలా గ్యారంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) తీసుకురావాలని మన ప్రభుత్వం సంకల్పించిందని" సీఎం జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 1.99 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి ప్రొబేషన్ ఖరారు చేశారు. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. చివరికి జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2,93,653 మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పాత పింఛన్ అమలుపై గెజిట్ విడుదల చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి ఛత్తీస్‌గఢ్ ప్రావిడెంట్ ఫండ్‌ని తీసుకొచ్చారు. ఉద్యోగి బేసిక్‌లో 12% సీజీపీఎఫ్‌లో మదుపుచేయాలి. దీనిపై వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీవిరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తోంది. పింఛన్లు భారం కాకూడదనే.. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పింఛన్ల మొత్తంలో 4% భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెడుతోంది. సీపీఎస్ ఉద్యోగులు, ప్రభుత్వం జమచేసిన మొత్తం నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్)లో రూ.18వేల కోట్లు ఉన్నాయి. ఈ నిధులు వచ్చాక ఉద్యోగుల భాగాన్ని వారి పీఎఫ్ ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రూ.9 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఉంచుతామంది.
రాజస్థాన్‌లో ఏం చేస్తున్నారంటే...:రాజస్థాన్‌లో 5.32 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఏప్రిల్ నుంచి ఓపీఎస్ అమలు చేస్తోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం ఎన్‌ఎస్‌డీఎల్‌లో రూ.39 వేల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం వచ్చాక ఉద్యోగుల వాటాను వారి పీఎఫ్ ఖాతాలకు మళ్లిస్తుంది. ఉద్యోగి బేసిక్‌లో పీఎఫ్‌కు 12% జమ చేయాలి. ఈ మొత్తానికి వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తుంది.