EMPLOYEES JAC LEADERS: ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ఐక్యమై ఇప్పటి వరకు పోరాటం చేస్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు జతకలిశాయి. విజయవాడలో ఓ హోటల్ లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఐక్య కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. మెరుగైన పీఆర్సీ సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యం కావాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని సంఘాలు ఒకే జేఏసీ గా ఏర్పడి ఉమ్మడి పోరాటం చేయనున్నారు.
నాలుగు ఉద్యోగ సంఘాల చర్చలు అనంతరం .. ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ సంఘాల నేతలు , కార్యవర్గ సభ్యులు మరోసారి సమావేశమై చర్చించారు. ఉమ్మడి పోరాటంతో ప్రయోజనం ఉంటుందనే కలసి పోరాడాలని నిర్ణయించామన్న ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఐక్య కార్యాచరణ కోసం తమ పోరాట కార్యాచరణను నేటికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం రాత్రికి రాత్రి చీకటి జీవోలు ఇచ్చిందన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు .. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వెనుదిరిగేది లేదన్నారు.