ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jobs in Telangana: తెలంగాణలో పూర్తైన ఉద్యోగుల వర్గీకరణ.. నియామక ప్రక్రియ దిశగా అడుగులు - రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియ

కొత్తజోనల్‌ విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు,అధికారుల పోస్టుల వర్గీకరణను పూర్తి చేస్తూ జారీచేసిన ఉత్తర్వులతో ఉద్యోగాల నియామక ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని 87 శాఖల్లో ఉద్యోగుల వర్గీకరణ పూర్తైందన్న సర్కారు ఇతర జోన్లలో పని చేస్తున్నవారిని సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను ఆగస్టులోగా పూర్తిచేస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనతో వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.

jobs in telangana
jobs in telangana

By

Published : Aug 7, 2021, 6:56 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త జోనల్‌ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారుల పోస్టుల వర్గీకరణను ప్రభుత్వం తాజాగా పూర్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, ఆయా శాఖల్లోని పోస్టులను జిల్లా (లోకల్‌), జోనల్‌, బహుళ జోన్‌ కేడర్‌ వారీగా గుర్తించింది. అత్యధిక శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు జిల్లా కేడర్‌, పలు శాఖల్లో సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్లు జోనల్‌, గ్రూపు-1 ఆ పైస్థాయి అధికారులు బహుళ జోన్లలో ఉంటారు. ఆయా శాఖల వెసులుబాటు మేరకు కేడర్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. దీనికి అనుగుణంగా మొత్తం 84 విభాగాధిపతుల పరిధిలో ఉద్యోగాల వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జోనల్‌ విధానం అమలుకు ముందే ప్రభుత్వం పోస్టుల వర్గీకరణ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్ల విధానం కింద జిల్లా, జోన్‌, బహుళజోన్‌, రాష్ట్ర కేడర్‌లుండేవి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రెండు జోన్లతో కొనసాగింది.

తర్వాత కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టింది. జిల్లా, జోన్‌, బహుళ జోన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సచివాలయం, శాఖాధిపతుల పోస్టులు గతంలో రాష్ట్రస్థాయి కేడర్‌లో ఉండేవి. వాటిని జోనల్‌ విధానం కిందకు తెచ్చి అందరూ పోటీపడే అవకాశం కల్పించారు. ఈ ప్రకారం బహుళజోన్ల జాబితాలో రాష్ట్రస్థాయి పోస్టులుంటాయి. వీటి నేరుగా కాకుండా, పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. జిల్లా, ఏడు జోన్లు, రెండు బహుళజోన్ల వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చి ఆయా శాఖల్లోని పోస్టులను విభజించింది. ఈ ప్రాతిపదికనే నియామకాలు, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సాగనుంది.

త్వరలో ఉద్యోగుల సంఖ్య ఖరారు

కేడర్‌ ఖరారు కావడంతో ప్రభుత్వం ఇక జిల్లాలు, శాఖలవారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించనుంది. వారం రోజుల్లోనే ఇది పూర్తి చేయాలని భావిస్తోంది. ఇతర జోన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను కూడా ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ఎన్ని పోస్టులుండాలి, ప్రభుత్వ శాఖల్లో ఎందరు అవసరమనేది గుర్తిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నున్న ఖాళీల జాబితాను దాంతో పోలుస్తారు. అనంతరం తుది ఖాళీలను నిర్ణయిస్తారు.

ఉపాధ్యాయుల లోకల్‌ కేడర్‌ ఏంటో?

ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏ కేడర్‌ పరిధిలోకి వస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయం తీసుకొని రెండు మూడు రోజుల్లో వెల్లడించవచ్చని భావిస్తున్నారు. ఎంఈవో, డైట్‌ అధ్యాపకులను బహుళ జోనల్‌ కేడర్‌లో ఉంచినందున గెజిటెడ్‌ హెచ్‌ఎంలను కూడా అదే కేడర్‌లో ఉంచాలని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా భాను చంద్రప్రకాశ్‌ కోరారు.

సీఎంకు టీఎన్జీవో, టీజీవోల కృతజ్ఞతలు

రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ జిల్లా, జోన్లు, బహుళ జోన్ల వారీగా ఉద్యోగాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోలు, టీజీవోలు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఈ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్‌, మమత, ప్రతాప్‌, సత్యనారాయణలు తెలిపారు. ఖాళీల భర్తీ జరుగుతుందని, తెలంగాణ వారికే ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ఏ కేడర్‌లో ఎవరు?

జిల్లా కేడర్‌: టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌స్టెనో, డ్రైవర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, రెనో ఆపరేటర్‌, జమేదార్‌, చైన్‌మెన్‌, దఫేదార్‌, కుక్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌, ఫోర్‌మెన్‌, కార్పెంటర్‌, మేస్త్రీ, గార్డెనర్‌, చౌకీదార్‌, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌, కానిస్టేబుల్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌- 1

జోనల్‌ కేడర్‌:నాయబ్‌ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐ, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సూపరింటెండెంట్‌, నాన్‌ టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డ్రైవర్‌, అగ్రికల్చర్‌ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-2, 3, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ - 2

బహుళ జోనల్‌ కేడర్‌:డిప్యూటీ కలెక్టర్‌/ఆర్డీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, సూపరింటెండెంట్‌, తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హెల్త్‌ ఇన్‌స్టక్ట్రర్‌, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్‌ అధికారి, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ -1, జిల్లా రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3 తదితర అధికారులు.

ఇదీ చూడండి:

REGULAERISATION: క్రమబద్ధీకరణకు పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details