కష్టాలు చెబుతామంటే పట్టించుకోవట్లేదు.. సహనాన్ని పరీక్షించొద్దు! - సీఎస్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
రాష్ట్ర ప్రభుత్వానికిి ఉద్యోగ సంఘాల నేతలు ఆల్టిమేటం ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై వీరు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం రెండు జేఏసీల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిశారు.
employee organizations on salaries and pensions
By
Published : Oct 8, 2021, 6:57 AM IST
|
Updated : Oct 8, 2021, 7:19 AM IST
‘ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఏడో తేదీకి కూడా పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం ఓపికగా సహకరిస్తూ వచ్చాం. ఇంకా ఎన్నాళ్లు? మా ఉద్యోగుల ప్రయోజనాల్ని ఇంకెంత వరకు తాకట్టు పెట్టాలి?’ అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించాయి. కష్టాలు చెబుతామంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంలో ఎవరికి గోడు వెళ్లబోసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగులు తీవ్ర మనోవేదనతో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే సమైక్యంగా పోరాడతామని, ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ ఛైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గురువారం విజయవాడలో ఉమ్మడిగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. రెండు జేఏసీల్లోని వివిధ సంఘాల నాయకులూ పాల్గొన్నారు. తమ డిమాండ్లపై వీరు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం రెండు జేఏసీల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మను కలిశారు. వెంటనే జాయింట్ కౌన్సెల్ సమావేశం నిర్వహించి, ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని కోరారు. పీఆర్‌సీ అమలు, సీపీఎస్ రద్దు వంటి వివిధ అంశాలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, వీలైనంత త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవీ..
*వివిధ శాఖల ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవులు, పదవీ విరమణ చేసిన, చేయబోతున్నవారి ఆర్థిక బకాయిలు, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఇతర ఆర్థికపరమైన చెల్లింపుల విషయంలో ఆర్థికశాఖ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ అధికారీ బాధ్యత తీసుకోకపోవడం విచారకరం.
*ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి.
*వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీఏ బకాయిల్ని, పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం ఇవ్వాల్సిన ప్రయోజనాల్ని సంక్రాంతిలోగా చెల్లించాలి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి.
*ఉద్యోగుల ఆరోగ్య పథకానికి మా జీతాల నుంచి కోట్ల రూపాయల చందా వసూలు చేస్తూ కూడా, సరైన వైద్య సేవలందించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక నానా అవస్థలు పడుతున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలి. లేకపోతే ఈ పథకాన్ని రద్దు చేసి మా చందాను, ప్రభుత్వ చందాను కార్పొరేట్ బీమా సంస్థలకు అప్పగించి మెరుగైన వైద్యసేవలందించాలి.
*ఆర్‌ఓఆర్ ప్రకారం డీఎస్సీల ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే క్రమబద్ధీకరించాలి. దశలవారీగా మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి, ఆ వ్యవస్థను రద్దు చేయాలి.
*ఉద్యోగుల విస్తృత ప్రయోజనాల కోసం మాతో కలసి వచ్చే ఏ సంఘంతోనైనా కలసి పనిచేస్తాం. అయితే దశాబ్దాలుగా కలసి ఉన్న సంఘాల్లో చిచ్చు పెడుతున్నవారి పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.
‘రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నివేదిక ఇచ్చి ఏడాదైనా ఏమీ జరగలేదు. వాళ్లు చనిపోతే పిల్లలకు ఉద్యోగమిచ్చే పరిస్థితి లేదు. ప్రమాదం జరిగితే ఒక్క రూపాయి రావడం లేదు. సీపీఎస్ రద్దు చేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. రద్దు చేయరేమోనన్న అనుమానం పెరుగుతోంది. నాయకులు, జేఏసీలు వారితో కలసి రావడం లేదంటూ మమ్మల్ని నిందిస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఈ నిందలు పడమంటారు? సీపీఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రే హామీ ఇచ్చారు. ఇంతకు ముందులా ఆ సంఘం వేరు, ఈ సంఘం వేరు అని తప్పించుకోవడానికి లేదు. రెండు జేఏసీలు ఒకే వేదికపైకి వచ్చి మా సమస్యలు పరిష్కరించండని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఆయన వెంటనే జోక్యం చేసుకోవాలి’.- - బొప్పరాజు వెంకటేశ్వర్లు
‘కనీసం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి? మా సమస్య చెబుదామంటే ఆర్థికశాఖ అధికారులెవరూ అందుబాటులో ఉండరు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎప్పుడూ దిల్లీలోనే ఉంటారు. సీఎఫ్‌ఎంఎస్ నియంత్రణ మొత్తం ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ చేతిలో ఉంది. ఆయనతో మాట్లాడదామంటే కార్యాలయంలో ఉండరు. ఫోనుకు దొరకరు. మేం దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ డబ్బుని వేరే కార్యక్రమాలకు మళ్లించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గతంలో ఉద్యోగి చనిపోతే.. అప్పటికప్పుడు అధికారి జేబులోంచైనా మట్టి ఖర్చులు ఇచ్చేవారు. ఇప్పుడు చనిపోయి ఏడాదైనా మట్టి ఖర్చులు ఇవ్వలేని దుస్థితి. స్వీపర్లకు ఏడాదికాలంగా జీతాల్లేవు. రైల్వే ఉద్యోగుల్లా బోనస్‌లు ఇమ్మని మేం అడగటం లేదు. మా జీతాలు మాకిమ్మంటున్నాం. పీఆర్‌సీ నివేదిక వచ్చి ఏడాదైంది. పొరుగు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇక్కడెందుకు చేయరు?’ -బండి శ్రీనివాసరావు