ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees Allocation in TS: ఉద్యోగుల విభజన, కేటాయింపులో తెరపైకి కొత్త ప్రతిపాదన!

Employees Allocation: తెలంగాణలో ఉద్యోగులకు కొత్త స్థానాలు కేటాయించినా.. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లో మొత్తం ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియను పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొలువుల భర్తీ కోసం ఖాళీలను నిర్ధారిస్తారు.

ఉద్యోగుల విభజన, కేటాయింపులో తెరపైకి కొత్త ప్రతిపాదన!
ఉద్యోగుల విభజన, కేటాయింపులో తెరపైకి కొత్త ప్రతిపాదన!

By

Published : Dec 21, 2021, 1:29 PM IST

Employees Allocation: తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా.. ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తైంది. సీనియారిటీ, ఆప్షన్స్​ ఆధారంగా కొత్త జిల్లాల వారీగా కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. చాలా చోట్ల ఉద్యోగులకు కేటాయింపులు పూర్తి చేసి ఎస్​ఎంఎస్​ల ద్వారా సమాచారం ఇచ్చారు. కేటాయింపు ఆదేశాలు పంపించారు. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు సంబంధించిన కసరత్తు హైదరాబాద్‌లో కొనసాగుతోంది. బీఆర్కేభవన్ వేదికగా ప్రక్రియ జరుగుతోంది. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు.. సీనియారిటీ, ఆప్షన్స్​ ప్రాతిపదికన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా, పొరపాట్లకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నాలుగైదు రోజుల్లో..

TS Employee bifurcation: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.... ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఎప్పటికప్పుడు ప్రక్రియను సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో చాలా శాఖలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని... ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండే పెద్ద శాఖల్లో నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. ప్రక్రియ పూర్తయ్యాక కేటాయింపు ఉత్తర్వులను ఉద్యోగులకు ఇస్తారు.

వారికి వెసులుబాటు..

పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బంది కలగకుండా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేవలం కేటాయింపుల ఉత్తర్వులు మాత్రమే ఇస్తారని అంటున్నారు. కొత్త స్థానంలో రిపోర్ట్ చేశాక విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు పాత స్థానాల్లోనే కొనసాగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయితే.. ఖాళీలకు సంబంధించిన కచ్చితమైన నిర్ధారణ వస్తుందని... దాంతో ఖాళీల భర్తీ చేయవచ్చన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.

ఆందోళన వాయిదా..

ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై తమ అభ్యంతరాలను ఉపాధ్యాయ సంఘాలు.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లాయి. సీనియారిటీ జాబితాల్లో తప్పులు సవరించాకే కేటాయింపులు చేయాలని వారు కోరారు. ఎక్కడా తప్పులు లేకుండా చూస్తామని సీఎస్​ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో.. ఇవాళ పాఠశాల విద్యా సంచాలకులు సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. భార్యాభర్తలు, మ్యూచువల్ బదిలీలను.... ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా రెండో దశలో చేపడతామన్నారు. జిల్లాల కేటాయింపు తర్వాత.. పాఠశాలల కేటాయింపు మార్గదర్శకాలు.. ప్రభుత్వం విడిగా విడుదల చేస్తుందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చెప్పారు. సీఎస్‌ హామీతో ఇవాళ తలపెట్టిన ఆందోళనను... ఉపాధ్యాయ సంఘాలు వాయిదా వేశాయి.

ABOUT THE AUTHOR

...view details