Electricity employees on VRS: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) బాట పట్టారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలో సుమారు 100 మంది విద్యుత్ ఇంజినీర్లు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఈ అంశం ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబరు ఆఖరుకు వందల సంఖ్యలో సిబ్బంది ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి మాస్టర్ స్కేల్ ఆధారంగా పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ చెల్లింపు నిబంధనలను అమల్లోకి తేవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు ఉద్యోగుల్లో ప్రచారం సాగుతోంది. యాజమాన్యం ఈ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు ఉద్యోగులు చెప్పారు. ఇది అమలైతే సుమారు రూ.30-40 లక్షల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. అలాగే పింఛన్‌లో కనీసం రూ.50 వేలు తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే వీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఐదేళ్ల సర్వీసు ఉన్న వారూ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయటం గమనార్హం.
సిబ్బందికి ప్రత్యేక పేస్కేల్
ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా విద్యుత్ సిబ్బందికి ప్రస్తుతం ప్రత్యేక పేస్కేల్ అమలవుతోంది. 1999లో విద్యుత్ బోర్డు నుంచి డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలతో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో రెండు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే పేస్కేల్ వర్తింపు మొదటి ప్రతిపాదన. ఫిట్‌మెంట్‌లో 5 శాతం తగ్గించి.. ప్రతిఫలంగా 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా ఒక వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నది రెండో ప్రతిపాదన. రెండో ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ఎంచుకున్నాయి. దీనిపై అప్పట్లో ట్రైపార్టీ ఒప్పందం(ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, ఉద్యోగ సంఘాలు) కుదిరింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 16 వెయిటేజ్ ఇంక్రిమెంట్‌లు విద్యుత్ సిబ్బందికి వచ్చే అవకాశం ఉంది. వాటికి చెల్లించే మొత్తాన్ని మాస్టర్ స్కేల్‌లో కలపకుండా.. వ్యక్తిగత జీతాల్లో కలిపి ప్రస్తుతం చూపుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులో వాటినీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నిబంధనను మార్పు చేసి.. మాస్టర్ స్కేల్ ప్రకారం ఉన్న జీతాలకే పింఛన్ ప్రయోజనాలను పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. ఇదే ప్రస్తుతం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా మారింది.