వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) 2022 జనవరిలోగా ఎన్నికలు పూర్తిచేసి.. కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. డిసెంబరు చివర్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రెండుదశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు.
2018 నుంచి సాగతీతలే:2013 జనవరి, ఫిబ్రవరిలో పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. వీరి పదవీకాలం 2018లో ముగిసింది. తర్వాత ఆరు నెలల చొప్పున పదవీకాలం పొడిగిస్తూ వచ్చారు. 2019 జులైలో పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీలను నియమించారు. వీరికీ ఆరు నెలలకోసారి పొడిగింపు ఇచ్చారు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్ ఇన్‌ఛార్జిలు, డీసీసీబీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లను ఆరు నెలల కాలానికి నియమించారు. వీరినే మరింతకాలం పొడిగించి.. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఇతర పనులతో వీరు పీఏసీఎస్ కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారని.. రైతులకు రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందని వైకాపా నేతలు మంత్రులు, ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీల పదవీకాలం వచ్చే జనవరితో ముగియనుంది.