చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా అధికార, విపక్ష పార్టీ మద్దతుదారులు బాహాబాహీకి దిగారు.
మహిళలపై పోలీసులు లాఠీ
నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం రాజవోలులో గ్రామస్థులు పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు. సామగ్రి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో మహిళలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని... పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ నిరసనకు దిగారు. దీంతో రెండు కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని కోళ్లబయలు పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సుల్ని లెక్కింపు కేంద్రానికి తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోనే లెక్కించాలంటూ ఆందోళనకు దిగారు.
ఇరువర్గాల మధ్య తోపులాట
గుంటూరు జిల్లా నూజండ్ల మండలం మారెళ్లవారిపాలెంలో ఓటేసేందుకు వస్తున్న కమ్మవారిపాలెం ఓటర్లను వైకాపా మద్దతుదారులు అడ్డుకున్నారు. వారిని ఓట్లు వేయనీయకుండా వెనక్కి పంపించేయటంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇదే జిల్లా నకరికల్లు పంచాయతీలోని పోలింగ్ కేంద్రంలోకి వైకాపాకు చెందిన స్థానికేతర నాయకులు రావటంపై తెదేపా మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని వారందర్నీ చెదరగొట్టారు. ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఓటర్ల నుంచి చీటీలు తీసుకుని.. వైకాపా మద్దతున్న అభ్యర్థులకు వారి ఏజెంట్లే ఓటేస్తున్నారంటూ ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు.
తెదేపా- వైకాపా కార్యకర్తలు బాహాబాహీ
విజయనగరం జిల్లా క్రిష్టపల్లి పంచాయతీలోని పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా కార్యకర్తలు.. వారు బలపరిచిన అభ్యర్థుల గుర్తుల్ని చూపిస్తూ ఓట్లు వేయమంటున్నారంటూ తెదేపా మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా- వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
వృద్ధులకు సహాయకులుగా వెళ్లి ..
కర్నూలు జిల్లా అవుకు మండలం వేములవాడలో పోలింగ్ ఏజెంట్లే ఓటర్లను లోపలికి తీసుకెళ్లి ఓట్లు వేయించుకుంటున్నారని ఓ వర్గం అభ్యంతరం తెలపటంతో ఘర్షణ చెలరేగింది. గడివేముల మండలం ఒండుట్ల గ్రామంలో 48 మంది ఓటర్ల పేర్లను పెన్నుతో రాసి జాబితాలో అదనంగా చేర్చారంటూ ఓ వర్గం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయటంతో పోలింగ్ కొంతసేపు నిలిచిపోయింది.
అతణ్ని చితకబాదారు
వృద్ధులకు సహాయకులుగా వెళ్లి తమ అనుకూల అభ్యర్థికి ఓటేయిస్తున్నారంటూ పెసరవాయి గ్రామంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు ప్రశ్నించారు. దీంతో పక్కనే ఉన్న మరో అభ్యర్థి మద్దతుదారులు అతణ్ని చితకబాదారు. పోలీసులు రెండు వర్గాల ప్రధాన నాయకుల్ని పోలీసుస్టేషన్‌కు తరలించారు.