నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిలో గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరైనా మరణిస్తే ఆ డివిజన్‌లో ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణతోపాటు అభ్యర్థులు మరణిస్తే అనుసరించాల్సిన విధివిధానాల్ని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వివరించింది.
ఏ సందర్భాల్లో ఎన్నిక వాయిదా వేస్తారు?
* గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్డ్ పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి.. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజున ఉదయం 10 గంటల తర్వాత మరణిస్తే, ఆ అభ్యర్థి నామినేషన్ పత్రాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని పరిశీలనలో తేలితే..
* నామినేషన్ల గడువు ముగిశాక.. ఒక అభ్యర్థి నామినేషన్ సరిగానే ఉందని పరిశీలనలో తేలాక, నామినేషన్ ఉపసంహరించుకోకుండా చనిపోతే..
* నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థి పోలింగ్ మొదలవడానికి ముందు చనిపోతే వాయిదా వేస్తారు. అభ్యర్థి చనిపోయిన విషయాన్ని రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించుకోవాలి. అక్కడ పోలింగ్ తేదీని మళ్లీ నోటిఫై చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.