ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ రాష్ట్రంలో జరగవలసి ఉంది. కానీ మెుదటి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు వెళ్లగా అధికారులు వారినుంచి పత్రాలు స్వీకరించకపోవడంతో హై డ్రామా చోటుచేసుకుంది. ఆశగా వెళ్లిన అభ్యర్థులు కొన్ని చోట్ల అధికారుల సమాధానం విని గందరగోళానికి గురవగా.. మరికొన్ని చోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం హైకోర్టు ఆదేశాలు ఎస్ఈసీకి అనుకూలంగా వచ్చినా.. ఆ కోలాహలం ఎక్కడా కనిపించలేదు. అనేక చోట్లో అధికారులు అందుబాటులో లేకపోవడంపై తెదేపా అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట నిరసలు చేశారు.
కృష్టా జిల్లాలో..
ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎన్నికలకు సంబంధించి ఆదేశాలు అందకపోవడంతో కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల హడావిడి కనిపించలేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇందుకు సంబంధించి మెటీరియల్, జిల్లా అధికారుల ఆదేశాలు అందకపోవడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఎటువంటి నోటీసు ప్రదర్శించలేదు. అధికారుల ఆదేశానుసారం ఎప్పుడైనా ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నూజివీడు ఎంపీడీవో రాణి తెలిపారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల పత్రాలు ఇవ్వకపోవడంతో సర్పంచ్ అభ్యర్థులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హొట్టేబెట్ట, దొడ్డేరి, రొళ్ల గ్రామపంచాయతీలకు నామినేషన్ వేయడానికి పత్రాలకోసం అధికారులను సంప్రదించగా.. అధికారులు ఇవ్వలేమనడంతో అభ్యర్థులు ధర్నాకు దిగారు. నామినేషన్ పత్రాలు, ఓటర్ లిస్ట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో..
పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా.. నెల్లూరు జిల్లాలో మాత్రం ఎలాంటి ఏర్పాట్లు కానరాలేదు. జిల్లాలో 946 పంచాయతీలు ఉండగా.. మొదటి విడత కింద నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతుండటంతో.. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. నామినేషన్ పత్రాలు సైతం పంచాయతీ కార్యాలయాలకు అందలేదని గ్రామాధికారులు చెబుతున్నారు. గ్రామ కార్యదర్శి తోపాటు సిబ్బంది తమ తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఎన్నికల హడావుడి ఎక్కడా కనిపించలేదు.
కడప జిల్లాలో..
నామినేషన్ల ప్రక్రియతో సందడిగా ఉండాల్సిన ఎంపీడీవో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక్క చోట కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. తొలిదశలోనే ఫిబ్రవరి 5వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదని ఎంపీడీవోలు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగి ఉంటే జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం ,ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలయ్యేది.