కరోనా పంజా విసరడంతో విద్యార్థులు ఆగమయ్యారు. బడులకు దూరమయ్యారు. చదువు చట్ట్టుబండలైంది. ఇప్పటివరకు నేర్చుకున్న నాలుగు ముక్కలూ మరిచిపోతున్నారు. కనీస అభ్యసన సామర్థ్యాలు ఘోరంగా పడిపోయాయి. మూడు నాలుగు అక్షరాల సరళ తెలుగు పదాలూ తప్పులు లేకుండా రాయడం గగనమౌతోంది. యునెస్కో, సేవ్ ది చిల్డ్రన్, యంగ్ లైవ్స్ తదితర సంస్థలు వేర్వేరుగా చేసిన అధ్యయనాల్లో పిల్లల విద్యా సామర్థ్యాలకు తీవ్ర నష్టం జరిగినట్లు వెల్లడైంది. పిల్లల చదువు, మానసిక ఆరోగ్యంపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్న ఎంవీ ఫౌండేషన్ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’ నిర్వహించిన సర్వేలోనూ పిల్లల చదువుల స్థాయి ఘోరంగా ఉన్నట్లు తేటతెల్లమైంది.
మూడుముక్కల్లో చెప్పాలంటే మన పాఠశాల విద్యార్థులు తెలుగు పదాలూ తప్పులు లేకుండా రాయలేరు.. లెక్కలు చేయలేరు.. ఆంగ్లం సరేసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ విద్యా సంవత్సరం 3-6 తరగతులు చదువుతున్న పిల్లల విద్యా సామర్థ్యాల స్థాయిని నిర్ధారించేందుకు ప్రశ్నపత్రాలిచ్చి చేసిన సర్వేలో పిల్లల చదువు పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు బహిర్గతమైంది. సగటున 46 శాతం మంది బొమ్మలను చూసి తెలుగులో రాయలేని దుస్థితి. గణితంలో 48 శాతం మంది రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేకపోయారు. ఆంగ్లంలో పదాలు రాయలేని వారు 44 శాతం మంది. సొంతంగా ఆలోచించి ఒక పేరా తెలుగులోనూ రాయలేకపోతుండటం ప్రధాన లోపంగా చాలా మందిలో కనిపించింది. అసలు విషయమేమిటంటే మూడోతరగతి స్థాయి ప్రశ్నప్రత్రాన్ని ఆరోతరగతి వారూ రాయలేకపోయారు.
కరోనా వైరస్‌తో 2020 మార్చిలో బడులు మూతపడ్డాయి. అప్పటి నుంచి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. గత విద్యా సంవత్సరం (2020-21) ఏపీలో ఉన్నత పాఠశాలలు నవంబరు 2 నుంచి విడతలుగా, ఫిబ్రవరి ఒకటి నుంచి ఏప్రిల్ 20 వరకు ప్రాథమిక బడుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. కరోనా రెండో దశ ఉద్ధృతితో మళ్లీ మూతపడ్డాయి. తెలంగాణలో రెండు నెలలపాటు ప్రత్యక్ష తరగతులు జరిగినా అవి 6-10 తరగతుల వారికి మాత్రమే. ఒక రకంగా దాదాపు ఏడాదిన్నరగా ఆన్‌లైన్ పాఠాలతోనే సరిపుచ్చారు. ఫోన్లు, టీవీ, నెట్ సౌకర్యం లేక... ఉన్నా సరిగా అర్థం కాకపోవడంతో అధిక శాతం మంది పిల్లలు పుస్తకాలు పట్టుకోవడం మానేశారు. దాని ఫలితంగా అభ్యసన సామర్థ్యాలు ఘోరంగా పడిపోయాయి.
ఇదీ ప్రశ్నపత్రం తీరు
విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ తరగతిలో ఏమి నేర్చుకోవాలో అభ్యసన సామర్థ్యాలను నిర్దేశించారు. ఆ ప్రకారం విద్యా సామర్థ్యాలను పరీక్షించేలా 3వ తరగతి స్థాయికి సమానమైన ప్రశ్నపత్రాన్ని రూపొందించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3-6 తరగతులు చదువుతున్న పిల్లలకు అందజేసి ‘ఈనాడు’ పరీక్షించింది. ప్రశ్నపత్రంలో తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల ప్రశ్నలున్నాయి.
3వ తరగతి స్థాయి ప్రశ్నలకూ జవాబులు రాయలేకపోయిన ఆరో తరగతి విద్యార్థులు
ప్రశ్నపత్రంలోని తెలుగు సబ్జెక్టులో ఇచ్చిన 15 బొమ్మల పేర్లు రాయాలి. ఆరు పదాలకు సొంత వాక్యాలు రాయాలి. మీ కుటుంబంలోని వారి పేర్లు, తెలిసిన ఆటలు, ఉపాధ్యాయులు, జంతువులు, పక్షుల పేర్లు రాసేందుకు మరో అయిదు ప్రశ్నలు. మీకు నచ్చిన మిత్రుడు లేదా జాతర లేదా పండుగ అనే అంశాల్లో ఒక దానిపై పేరా రాయాలి....ఇది మూడో తరగతి స్థాయి ప్రశ్నపత్రం. విచిత్రమేమిటంటే ఈ విద్యా సంవత్సరం(2021-22) ఆరో తరగతికిలోకి వచ్చిన వారిలో సగం మంది ఆ ప్రశ్నలకు సమాధానం సరిగా రాయలేకపోయారు. తెలుగులోనే కాదు... ఆంగ్లం, గణితం సబ్జెకులోనూ అదే దుస్థితి. మొత్తం 406 మంది ఆరో తరగతి పిల్లల్లో 190 మంది...అంటే 47 శాతం మంది పదాలు కూడా తప్పులు లేకుండా రాయలేకపోయారు. ఇప్పుడంతా ఆంగ్లం మోజు...మాతృభాషను తేలిగ్గా తీసుకుంటున్నారని అనుకున్నా ఆ సబ్జెక్టులోనూ అదే పరిస్థితి. అందులోనూ పదాలు కూడా వర్ణక్రమం రాయలేని వారు 184 మంది ఉన్నారు. అంటే 45 శాతం మంది. పదాలు, వాక్యాలు, పేరాగ్రాఫ్ విభాగాల్లో తప్పులు రాసినవారు 355 మంది(87 శాతం) ఉన్నారు. పుస్తకం, కంప్యూటర్, గొడ్డలి, గొడుగు లాంటి వాటి పేర్లు కూడా తెలుగులో సరిగా రాయలేకపోతున్నారు
విద్యా హక్కు చట్టాన్ని సవరించినా ఏదీ ప్రయోజనం?