కేరళలో వరద బాధితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తవటంలో నాటి అలప్పుజ సబ్ కలెక్టర్ కృష్ణతేజది కీలక పాత్ర. వరదల సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు దృష్టిలో ఉంచుకుని...ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేశారు. మిగిలిన ఇళ్లతో పోలిస్తే ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఇంటి నిర్మాణం కోసం ఎంపిక చేశారు. అంతేకాక సముద్రమట్టానికి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల ఎత్తుగా ఉండేలా ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు వహించారు. తద్వారా ఈ సారి వరదలు వచ్చినా ఇంటికి ఏ మాత్రం నష్టం కలగకుండా వెసులుబాటు కల్పించారు.
సంప్రదాయ నిర్మాణ శైలికి భిన్నంగా..
నిర్మాణం పూర్తైన ఇంటి ప్రదేశాలు జియో ట్యాగింగ్ చేయటం ద్వారా వాటి సమాచారాన్ని విపత్తు నిర్వహణ విభాగంలో పొందుపరచనున్నారు. ఫలితంగా...ఆ ప్రాంతంలో ప్రకృత్తి విపత్తులు సంభవిస్తే ఆ ఇళ్లే సహాయక కేంద్రాలుగా నిలుస్తాయి. కేరళ సంప్రదాయ గృహ నిర్మాణ శైలి సైతం గతేడాది వరదల్లో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. కారణం ఇక్కడ ఇళ్ల పైకప్పులన్నీ గోపురాల్లా...త్రిభుజాకారంలో నిర్మించటం వల్ల హెలికాప్టర్ ద్వారా ప్రజలను తరలించటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆహారం అందించటానికీ వీలు పడలేదు. అందుకే...ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా ఈనాడు ఇళ్లను సమతలంగా ఉండే పైకప్పులతో నిర్మించారు. భవిష్యత్‌లో ప్రకృతి విపత్తులు ఎదురైతే..వీటిపై హెలికాప్టర్‌లు నిలిపేలా నిర్మాణం చేపట్టారు.
గ్రామస్థాయి సమావేశాల్లో ఎంపిక ప్రక్రియ
లబ్ధిదారుల ఎంపిక ఈ ఇళ్ల నిర్మాణంలో కీలక దశ. నిజమైన బాధితులను గుర్తించి... వెచ్చించిన ప్రతీ పైసా వారికి ఉపయోగపడేలా ఉండాలనే లక్ష్యంతో స్థానిక సంస్థలను రామోజీ గ్రూప్ భాగస్వామ్యం చేసింది. కేరళలో ఎంతో బలోపేతంగా ఉండే అలప్పుజ జిల్లాలోని స్థానిక పంచాయతీలు, పురపాలక సంస్థలు తమ ప్రాంతాల్లోని అర్హులను ఎంపిక చేశాయి. గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి ఇల్లు తిరిగి కట్టుకోలేని నిరుపేదలను ఏకగీవ్రంగా ఎంపిక చేశాయి. రామోజీ గ్రూప్, కుటుంబశ్రీకి ఈ సమాచారం అందించారు. అలా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 121 అర్హులైన, నిరుపేదలైన వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచి సొంతింటి కలను నిజం చేసింది.