జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం ఒక్క రోజే అనంతపురం జిల్లాలో 17 మంది వ్యాధి లక్షణాలతో సర్వజనాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఇక్కడ 62 మంది బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నారు. వైద్యులు నలుగురికి శస్త్ర చికిత్సలు చేశారు. చిత్తూరు జిల్లాలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. జిల్లా పరిధిలో బుధవారం నాటికి 53 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
రుయా ఆసుపత్రిలో 28 మంది చేరగా, స్విమ్స్‌లో 25 మంది చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి యాంఫొటెరిసిన్ బి ఇంజక్షన్లు ఇస్తున్నారు. రుయాలో ఇద్దరికి, స్విమ్స్‌లో ఒకరికి శస్త్రచికిత్స చేశారు. ముగ్గురు బాధితుల ఆరోగ్యం బాగా మెరుగుపడిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం నాటికి 47 మంది చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ డా.ఆర్.మహాలక్ష్మి తెలిపారు. వీరిలో 40 మంది కొవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఫంగస్ బారిన పడ్డారన్నారు.