ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమ్మభాషలో ప్రావీణ్యముంటే... ఇతర భాషలను వేగంగా నేర్చుకోవచ్చు' - ap latest news

EEnadu Editor Nageswara Rao: మాతృభాషలో ప్రావీణ్యం ఉన్న వారే ఇతర భాషల్ని వేగంగా నేర్చుకోగలరని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు తెలిపారు. బిడ్డకు తల్లిపాలు ఎంతో, మనిషికి అమ్మ భాష అంతే.. మనం ఎంత చదువుకున్నా.. మనకు ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషలోనే ఆలోచిస్తామన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం సోమవారం నిర్వహించిన వర్చువల్‌ వెబినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు
‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు

By

Published : Feb 22, 2022, 11:12 AM IST

ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో జరిగినప్పుడే విద్యార్థుల్లో నిజమైన వికాసం కలుగుతుందని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు తెలిపారు. మాతృభాషలో ప్రావీణ్యం ఉన్న వారే ఇతర భాషల్ని వేగంగా నేర్చుకోగలరని వెల్లడించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం సోమవారం నిర్వహించిన వర్చువల్‌ వెబినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ‘‘బిడ్డకు తల్లిపాలు ఎంతో, మనిషికి అమ్మ భాష అంత. మనం ఎంత చదువుకున్నా.. మనకు ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషలోనే ఆలోచిస్తాం. పరాయి భాషలో ప్రాథమిక విద్య భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ లేదు. శాస్త్రవేత్తలు, నోబెల్‌ పురస్కార గ్రహీతలు, న్యాయమూర్తులు, వేర్వేరు రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిలో ఎక్కువమంది మాతృభాషలో చదువుకున్న వారే. కార్ల్‌మార్క్స్, ఐన్‌స్టీన్‌ ఇందుకు ఉదాహరణ. మనలాగా ఇన్ని భాషలు మాట్లాడే దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అందువల్లే భాషా విధానంలో మనకింత గందరగోళం. మన జనాభాలో 40% మంది మాత్రమే హిందీని అర్థం చేసుకుంటారు. 10% కంటే తక్కువ మంది మాత్రమే ఆంగ్లంలో మాట్లాడగలరు. అయినా భిన్నత్వంలో ఏకత్వం మనది.

బలమైన సాంస్కృతిక బంధం కారణంగా ఈ పరిమితులతో సంబంధం లేకుండానే ఒక దేశంగా ఏకీకృతమయ్యాం. ఇప్పుడు క్రికెట్, సినిమా, సంగీతం భావోద్వేగపరంగా ప్రజలను ఏకం చేస్తున్నాయి. మాతృ భాషలో చదువుకోవడం, చర్చించడం ద్వారా లోతైన భావాలను అర్థం చేసుకోవడం సులభం. అందుకే మరే ఇతర దేశమూ ప్రాథమిక విద్యలో పరాయి భాషని బోధనా మాధ్యమంగా అనుమతించదు. పాఠశాలలోనూ, ఇంట్లోనూ ఒకే భాష ఉండాలి. దానివల్ల పిల్లల్లో స్పష్టత, విశ్లేషణ సామర్థ్యాలు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర, సాంకేతిక విద్య, న్యాయ విద్య కోర్సులను చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, రష్యన్‌ భాషల్లో అందిస్తున్న ఆయా దేశాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన భారతీయ భాషలన్నింటికి కూడా ఎంతటి సంక్లిష్ట భావాలనైనా వ్యక్తీకరించడానికి, బోధించడానికి అనుకూలతతోపాటు గొప్ప పదజాలం ఉంది. అనేక భారతీయ భాషలను కోట్లాది మంది మాట్లాడతారు. మనిషికి, ఇతర జీవరాశులకు ఉన్న ప్రధానమైన తేడా కమ్యూనికేషన్‌. ఇది లేకపోతే నాగరికత లేదు. కమ్యూనికేషన్‌కు మూలం భాష’’ అని వెల్లడించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి వీఎస్‌రావు మాట్లాడుతూ... యువత ఆంగ్లంతోపాటు మరో మూడు భాషల్లో నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. మాతృభాష పరిరక్షణ గురించి స్ఫూర్తిదాయక వివరాలు వెల్లడించిన ఎం.నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థుల వ్యవహారాల సహాయ సంచాలకుడు బాలకృష్ణ, డీన్‌ డాక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details