రాష్ట్రంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఏపీలో యథావిధిగానే పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తో కోవిడ్ పరిస్థితిపై సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.
తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న మంత్రి.. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో కొవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.