ఇంటర్ విద్యవ్యవస్థను ప్రక్షాళన చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతిలో మాట్లాడిన ఆయన... ఇంటర్ విద్యలో 80 శాతం ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు, పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టంచేశారు. ఐఐటీ, ఐఐఎం కోచింగ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకుంటామన్న ఆయన... టెక్నో స్కూళ్ల బోర్డులు తొలగించేలా ఆదేశిస్తామన్నారు. 2 వేలకుపైగా ప్రైవేట్ కళాశాలలు నిబంధనలు ఉల్లఘించాయని మంత్రి తెలిపారు.
కార్పొరేట్ కళాశాలల బోర్డులపై పేరు, కోడ్ నెంబరే ఉండాలని... ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఏకీకృత నేమ్ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ బోర్డులను 10 రోజుల్లోగా మార్చకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆటమైదానాల్లేవన్న మంత్రి... అగ్నిమాపకశాఖ అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలుంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలకూ ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. ఉన్నతవిద్యలో ఫీజుల నియంత్రణపైనా కమిషన్ ఏర్పాటుచేశామని గుర్తు చేశారు.