Tailoring Training: కొందరికి టైలరింగ్ పై ఆసక్తి. మరికొందరికి కుట్లు, అల్లికలంటే మక్కువ. ఇంకొందరికి వృథా వస్తువులతో గృహోపకరణాల తయారీ అంటే ఇష్టం. ఇలా విభిన్న అభిరుచులున్న మహిళలు, యువతులంతా ఏకమయ్యారు. ఒకే వేదికపై నిపుణుల సారథ్యంలో కలసి కట్టుగా శిక్షణ పొందారు. నైపుణ్యాలను ఒకరికొకరు అందిపుచ్చుకుంటూ ఆరితేరారు. అందరూ కలసి స్వయం ఉపాధి నైపుణ్యంతో ఉపాధి పొందుతున్నారు.
స్వయం ఉపాధితో సమైక్య విజయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు, గృహిణులు స్వశక్తితో ఎదిగేందుకు భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా నెహ్రూ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో శిక్షణ కేంద్రాలను నెలకొల్పింది. ఈ సంఘాల్లో బాబామెట్ట ప్రాంతానికి చెందిన మదర్ థెరిస్సా మహిళా మండలి మేటిగా నిలుస్తోంది. విభిన్న అభిరుచులు ఉన్న వారంతా ఏకమై ఆయా స్వయం ఉపాధి విభాగాల్లో మూడు నెలల శిక్షణలో రాటుదేలారు. వారంతా కలిసి తయారు చేసిన వివిధ రకాల వస్తువులను అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు.
మదర్ థెరిస్సా మహిళా మండలి సభ్యులు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, అల్లికలు, కుట్లు, పెయింగ్ వంటి చేతివృత్తుల్లో ఎంతో నైపుణ్యం సాధించారు. మారిన వస్త్రధారణ, వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త కొత్త డిజైన్లలో వస్త్రాలు తయారు చేస్తున్నారు. అన్ని వయస్సుల వారికి నచ్చేలా వస్త్రాలను కుట్టటంలో నైపుణ్యం సాధించారు. శిక్షణలో అత్యాధునిక కటింగ్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడింగ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా వినియోదారుల అభిరుచుల మేరకు కొత్తకొత్త ఆకృతులు, డిజైన్ దుస్తులు, హస్తకళల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. భవిషత్తులో ఈ నైపుణ్యం మహిళలకు, యువతులకు స్వయం ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరంలో వేడుకలు, ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న స్టాల్స్‌లో మదర్‌థెరిస్సా మహిళ మండలి ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశం ఇస్తోంది. మహిళల స్వయం ఉపాధికోసం ప్రధానమంత్రి గ్యారంటీ ఉపాధి కార్యక్రమం, ముద్ర ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:శాసనసభ నుంచి.. ఐదుగురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్!