జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తనపై కేసు కొట్టేయాలన్న ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టులో శ్రీనివాసన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది. జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా సంస్థల్లో... ఇండియా సిమెంట్స్ పెట్టిన 140 కోట్ల రూపాయలు ముడుపులేనని కౌంటర్లో పేర్కొంది.
వైఎస్సార్ ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా నదీ జలాలను కేటాయించిందని..., కడపలో రెండున్నరెకరాల భూమి లీజును పొడిగించిందని చెప్పిన ఈడీ... దానికి ప్రతిఫలంగా ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. సుమారు 70 ఏళ్ల అనుభవం ఉన్న ఇండియా సిమెంట్స్... ఉత్పత్తి ప్రారంభం కాని సంస్థ... నష్టాల్లో ఉన్న కంపెనీల్లో అధిక ప్రీమియంతో వాటాలు కొనుగోలు చేసిందని తెలిపింది. తన కంపెనీలో పురోగతి లేకపోయినప్పటికీ అదే రంగంలోకి కొత్తగా వచ్చిన సంస్థలో అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పేర్కొంది.