Ed Enquiry on chikoti praveen: క్యాసినో వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డితోపాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించిన అధికారులు ఫెమా ఉల్లంఘనలపై ప్రశ్నించారు. సినీతారల పారితోషికాలు, ప్రత్యేక విమానాల్లో తరలింపు, ఛార్టర్డ్ ఫ్లైట్ల గురించి ఆరా తీశారు. బ్యాంకు లావాదేవీల వివరాలతో పోల్చుతూ ప్రవీణ్ బృందం చెప్పే సమాధానాలను క్రోడీకరించుకున్నారు. ప్రవీణ్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో సంపత్ కీలకంగా వ్యవహరించడంతో వారిద్దరు చెప్పే సమాధానాలను పోల్చిచూశారు. క్యాసినోల నిర్వహణ ద్వారా కూడబెట్టిన కమీషన్ల సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని విచారించారు.
చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై ఆదాయపన్నుశాఖ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ ఇప్పటికే ఐటీశాఖకు అందించినట్లు తెలిసింది. ప్రవీణ్ జన్మదిన వేడుకలతోపాటు ఇతర కార్యక్రమాల్లో మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు అతడి ఆడంబర జీవితానికి సంబంధించిన పలు అంశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రవీణ్ కొన్నేళ్లుగా గోవాలో క్యాసినోల నిర్వహణ ద్వారా భారీగా కమీషన్లు కూడబెట్టడంతో పాటు ఇటీవల విదేశాల్లోనూ పెద్దఎత్తున పంటర్లను సమీకరించి జూదమాడించిన విషయంపై ఐటీశాఖ దృష్టి సారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ సేకరించే సమాచారం ఆధారంగా ఐటీ శాఖ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.