ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ చదివిన ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలను రాయాల్సి వస్తోంది. రెండో ఏడాదిలో అటు అకడమిక్, ఇటు ప్రవేశ పరీక్షలతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈసారి కొన్ని వర్సిటీలు మూడు పర్యాయాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధానాన్ని తెచ్చాయి. ఇలా పరీక్షలకు దరఖాస్తు చేసేందుకే ఒక్కొక్క విద్యార్థి రూ.10వేలనుంచి రూ.15వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయన్న భావనతో వేలాది విద్యార్థులు కనీసం రెండు, మూడు డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. అలాగే జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్, ఏపీ ఈఏపీసెట్, తెలంగాణ ఎంసెట్‌లకూ హాజరవుతున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.
మూడేసి పర్యాయాలు..:ఇంజినీరింగ్ ప్రవేశాలకు ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు మూడు విడతల పరీక్ష విధానాన్ని తెచ్చాయి. వీటికి తోడు జేఈఈ మెయిన్ సైతం రెండు విడతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు సైతం ఎన్ని అవకాశాలుంటే అన్నింటిని వాడుకుంటూ ఒత్తిడికి లోనవుతున్నారు.
*ఏపీ ఈఏపీసెట్ జులై4 నుంచి 12, తెలంగాణ ఎంసెట్ జులై14 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఇవికాకుండా జేఈఈ మెయిన్ మొదటి విడత జూన్, రెండో విడత జులైలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత అడ్వాన్సుడ్ ఆగస్టులో ఉంది.